Sunday 3 April 2011

We love Sparrow

పిచుక......
పిచుక. ఈ పేరు వింటేనే.. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి అనుభవం ఏదో ఒకటి గుర్తురాక మానదు. పొద్దు పొడవక
ముందే ఇంటి చూరిపై గుంపుగా వాలి.. కిచ కిచమంటూ మనల్ని నిద్రలేపిన మన ఊరి పిచుకలు గుర్తొస్తాయి.
ఆనక పొలంగట్టు పైనుంచి బిలబిలమంటూ ఎగురుకుంటూ వరికంకులపై వాలిన పిచుకలు మన మస్తిష్కంలో..
దృశ్యంగానూ మెరవొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో మన ఇంటి వాకిలి సాక్షిగా.. సందడి చేసిన పిచుకలు.. మన
నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతరిస్తున్నాయి. ఏవీ.. నిన్నా మొన్నటి దాకా
ఇంటి పెరట్లో, గొడ్ల చావిడ్లో, చెట్ల మధ్యలో ఎగురుతూ, గెంతుతూ.. సవ్వడి చేసిన పిచుకలు.. ఎక్కడా.. అని ఆరాతీసే
పరిస్ధితి నుంచి మేల్కొందాం. ఇప్పటికే పర్యావరణ వేత్తలు.. మరో కొన్నాళ్ళుపోతే... పుస్తకాల్లో మాత్రమే పిచుకల్ని బొమ్మలుగా.. చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి మేలేగానీ కీడు చేయని పిచుకలు..  ప్రజల వినియోగించే సెల్‌ఫోన్ వాటి టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల సంతానోత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. దీంతోపాటు.. పచ్చని పల్లెలన్నీ.. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. వేలెడంత పిచుకకు నిలువ నీడనిచ్చే పరిస్థితే సమాజంలో కరవవ్వడంతో.. ఇప్పడు పిచుకల మనగడ ప్రశ్నార్ధకంగా మారింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. పిచుక సవ్వడిని విన్నవాళ్ళు లేదా చూసిన వాళ్ళు. అరుదనే చెప్పాలి.ఈ క్రమంలో పర్యావరణ ప్రేమికులు.. పిచుకల జాతి అంతరించడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నారు. ఈ
నేపథ్యంలో పిచుకల పరిరక్షణ విషయంలో ఇప్పడిప్పుడే అనేక జీవకారుణ్య సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇదొక మంచి ప్రయత్నంగా మనమంతా సహకరించాలి.మనింటి పిల్లలు పిచుక అంటే ఎలా ఉంటుంది.. అని ప్నశ్నించకుండా ఉండాలంటే.. మనకున్నంతలో వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే. మనింటి వాకిట్లో గుప్పెడు గింజలు, కాస్త పచ్చదనం ఉండేలా ప్రయత్నిస్తే.. కచ్ఛితంగా పిచుకల కిలకిల రావాలు.. వినొచ్చు. ఒక్కొక్కటి చేరిన పిచుకల సమూహంలో మునిగి కాసేపు సేదతీరనూ వచ్చును.

No comments:

Post a Comment