Thursday 21 January 2016



వాటీజ్ యువర్ కలర్?!
..
కులానికి రంగుందా!
ఏమో ఉండే ఉండొచ్చు
నల్లగా.. ఉండొచ్చు
ఎర్రంగానైనా ఉండొచ్చు
మధ్యరకంగానూ ఉండొచ్చు
ఏదో ఒక రంగు ఉండే ఉండొచ్చు!!
000
ఒకవేళ..నల్లగా ఉంటే..
ఊరవతల ఉండమని,
ఆధిప(పై)త్యపు గీతదాటొద్దని
శపించేస్తారేమో!?
పోనీ తెల్లగా ఉంటే?!.
మడికట్టుకుని వేదాలు వల్లించమంటారా!?
పోతేపోనీలే మనోడే కదా అని
అగ్రకులపు మెడలేసి పటేల్ ని చేసేస్తారా!?
అసలు కులానికి రంగుందా?!
ఏమో..ఉండే ఉండొచ్చు.
000
అన్నట్టు.. అదిగదిగో
అక్కడో కులం ఎర్రగా ఉంది
ఎర్రగావున్న ఆ కులపోడి రకతం
సలసల ఉడికిపోతుంది.
అరె.. ఇక్కడ ఈ కులం నల్లగా ఉందే..
అయినా ఈ కులపోడి రకతం కూడా
సలసలా కాగిపోతుంది. అదెట్టా!?
అన్నికులపు రకతాలు వేడిగానే ఉన్నాయి
రగిలేపోతూనే ఉన్నాయి
000
ఓరి దేవుడోయ్..
ఎవరో..కులానికి రంగేస్తున్నారు
రంగుతోపాటు ముసుగులూ కప్పుతున్నారు
ఆడు.. వీడు.. మనోడు.. కానోడు
అని వీరంగం వేస్తున్నారు..
చదువులమ్మ బడిలోకి
సిగ్గూఎగ్గూ లేకుండా దూసుకొచ్చి
పూనకం వచ్చిన కోతుల్లా
వీరంగమాడుతున్నారు
అరె ఎవర్రా.. అదీ?!
000
మనిషి అస్తిత్వానికి మాత్రమే ఓ కులం
మరి..అస్తిత్వమంటే?!
మనిషిలోంచి మనిషిని
వేరు చేయడమా?!కాదురోయ్
ఆత్మాభిమానంతో బతకడం
బతుకుదామని చెప్పడం
కులాల గుంపుగా..
సంఘజీవనం చేయడం
...
కులానికి రంగులేదు
కులం అంటే ఎవరో కాదు, మనిషే
ఆ.. మనిషిలో రకతం ఉంది
ఆ రకతానికి మాత్రమే.. ఎర్రని రంగుంది
అందరిలోనూ.. అదే రంగు
మరి మనిషి అనే కులానికి
రాజకీయ రంగులా!?
తప్పు.. తప్పు.. తప్పు!!!

-గంగాధర్ వీర్ల, 21-01-2016