Tuesday 19 July 2016


రమించే దేహం
...............
దేహాన్ని చీల్చుకునేంత
మోహం..నాలో లేదు
నా దేహం సంతోషంగా ఉంటేనేగా
నీతో రమించేది
సుఖించేది
దేహం కోరికలతో రగిలిపోతున్న
శరరపు స్పర్శకాదు
ప్రాపంచిక లౌక్యాన్ని దాటిపోవాలనే
అలౌకికమైన సంగమం.
దేహమంటే?!

నీలో నేను
నాలో నీవు కలిసిపోయే
కరిగిపోయే సాదృశ్యం
-గంగాధర్ వీర్ల

Friday 15 July 2016


దెరీజ్ నో రొమాన్స్?
నా ప్రమేయ లేకుండానే
రాత్రి, పగళ్ళు.. రోజూ
నా పక్కనే వచ్చివాలుతూనే ఉన్నాయి
అయినాగానీ..
రెప్పవాల్చని హృదయం
తన గుప్పెట్లో దాచుకున్న
రెండింతల పరిమళాన్ని
ఇప్పటికీ బంధీగానే దాచుకుంది
000
మాయామోహపు ఊహల్లో
ఇలా ఎన్నోరాత్రులు.. ఆ ఆలోచనల దీవిలో
ఒక్కొక్కటిగా బలపడిన బంధనాల్ని
విడిపించుకోలేనంత
చనువు సెగల పోటాపోటీ
అక్కడంతా..
కౌగిల్లో దాచుకోవాలన్నంత నిశ్శబ్దమే
అయినా..
ఆ ఏకాంత శిఖరపు అంచుదాక..
ఎవరో వచ్చి ఒళ్ళంతా వెన్నలద్దినట్టుగా
పరవశపు సమీరం
చెమట చుక్కల కలబోతల మధ్య
తడి ఆరని సంకేతాలు
గంధపు సుగంధాలవుతున్నాయ్
000
నిద్రపోయేవేళ
జాగరపు గడియలు
అంతకంతకు బరువెక్కుతున్నాయ్
గెలిచేది ఎవరో మరి
-గంగాధర్ వీర్ల
15-06-16

Wednesday 6 July 2016

// క్యా బాత్ హై //
నిక్కర్లు వేసుకునే వయసులో
అన్వర్ గాడు నేనూ
ఒకే జీడిని కాకెంగిలి చేసుకుని తినేవాళ్ళం
వాడు మా ఇంటికొస్తే
అమ్మ చేసిన చింతపండు పులిహోర
ఎంతో ఇష్టంగా ఆమ్మని తినేశేవాడు
మహా మహా సొగ్గాడు
రోజంతా అత్తర్లతో ఘుమఘమలాడేవాడు
ముచ్చటపడితే నాచొక్కాక్కూడా
కూసింత పోసేవాడు
000
హైస్కూల్ చదివే రోజుల్లో
జానీగాడు నా బెంచ్ మేట్
భుజాలల్లుకుని, కాలరెగరేసుకుని
ఊరంతా తిరిగేవాళ్ళం
దారిపొడుగునా
తియ్యని సేమ్యా కబుర్లే
వాడు స్కూల్ కి రానిరోజూ
నాక్కూడా కడుపునొప్పి వచ్చేసేది.
కుంటిసాకుతో సగం బడికి ఎగనామం
హుషారుగా జానీగాడింటికి పరుగే పరుగు
000
మీసాలొచ్చాక..
షరీఫ్, యాకూబ్, ఖదీర్, రఫీ, హుస్సేన్
ఇంకా చాలామంది ఆప్యాయతను పంచిపెట్టే దోస్తులయ్యారు
000
ఒకప్పుడు అన్వర్, జానీగాడు
తర్వాత షరీఫ్, యూకూబ్, ఖదీర్, రఫీ, హుస్సేన్
పేర్లు మారాయి అంతే..
అవే స్నేహాలు
అవే ఆప్యాయతలు
-గంగాధర్ వీర్ల
06-07-16