Tuesday 28 June 2016


నువ్వొక వర్షపు చినుకు

ఉదయాన్ని చీలుస్తూ
చిటపట.. పటపట
చినుకులే చినుకులు
తడిసి ముద్దవుతున్న
చిగురుటాకులు
000
చినుకులో చినుకైన వేళ
తడిని అప్పుగా తెచ్చుకున్న నేలపై
అడుగులు వడివడిగా తడబడి
నాలో మురిసె కలబడి
000
మనసు తెరిచిన కిటికీలో
నీ నవ్వుల జ్నాపకం
తుంపరవుతోంది
తుంటరిగా ముసురుతోంది
000
ఇంకా చినుకులు పడుతున్నాయ్
తడి ఆరని అల్లరితో
వళ్ళంతా జల్లవుతోంది
నులివెచ్చని చెలిమవుతోంది!!
-గంగాధర్ వీర్ల
28-06-16

Saturday 18 June 2016

నాన్మ
ఓ.. మహాసముద్రం
..............
తారాజువ్వలు
చిచ్చూబుడ్లు
సిసింద్రీలు
సీమటపాకాయలు
000
పీచుమిఠాయి
పుల్లయిసు
మరమరాలుండ
సాగే జీడి
మామిడితాండ్ర
కలర్ సోడా
000
నల్లని కనికలు
బాల్ పెన్నులు
కలర్ పెన్సిళ్ళు
రంగులు, స్కెచ్ పెన్నులు
000
నాలుగు జేబుల నిక్కరు
బెల్ పాంట్ ప్యాంటు
తెల్ల లాల్చీపైజమా
000
కొత్త చెప్పులు
మెరిసే బూట్లు
ఫంక్ స్టయిల్ క్రాపు
000
నేలటిక్కెట్టు సినిమా
రంగుల రాట్నం
అద్దె సైకిళ్లపై తిరుగుళ్లు
000
కలర్ ఫుల్ లెటర్ హెడ్స్
ప్రేమలేఖలు
ఊహల్లో కవితలు
టిప్ టాప్ టక్ లు
బస్ స్టాండ్ లో షికార్లు
000
ప్రయివేటు ట్యూషన్లు
పబ్లిక్ పరీక్షలు
ర్యాంకులు, ఫీజులు
000
హీరో సైకిళ్లు
మోటార్ బైక్ లు
కంప్యూటర్లు
ల్యాప్ ట్యాప్ లు
000
విదేశీయానాలు
ఉద్యోగాలు
పెళ్లిల్లు
పిల్లలు
....
ఇంకా అనేకం
నాన్న కష్టంలోంచి
చెమటోడ్చిన జేబులోంచి
ఫలించినవే
000
నాన్న
బతుకు నేర్పిన పాఠం
ప్రతిఫలం ఆశించని మహాసముద్రం
-గంగాధర్ వీర్ల

Saturday 4 June 2016

చెట్టు-పిట్ట
..........
మనం పుట్టి పెరిగిన ఊరు..
ఊరులా లేదు.
నిన్నామొన్నటి వరకూ..
గుండెలనిండా అమాయకత్వాన్ని నింపుకుని
మనందరినీ తల్లిలా ఆదరించిన
మన పల్లె ఏమాత్రం పచ్చగా లేదు.
000
చెట్టు చెట్టుగా లేదు....
పుట్ట పుట్టగాలేదు ....
చెట్టు కొమ్మపై వాలే పిట్ట జాడాలేదు..
గుండె బరువెక్కుతోంది
000
చెట్టుని బతికిద్దాం
చెట్టు బతికితే పిట్ట బతుకుతుంది
పిట్ట బతికితే మనమూ బతికినట్టే!!
-గంగాధర్ వీర్ల

Friday 3 June 2016


యస్.. ఐ గాట్ ఇట్!!
1
తీరం వెంబడి
వెదుకులాట
ఒకొ్క్క అడుగుసాగుతూనే ఉంది
ఆశగా.. ఆత్రంగా
అడుగుపై అడుగు పడుతూనే ఉంది
ఒద్దికగా.. మరీ జాగ్రత్తగా..
నత్తగవ్వలు, ముత్యపు చిప్పలు
వజ్రంలా మెరిసే.. ఇసుకరాళ్ళు
కలగలిపి ఆమాంతంగా
దోసిళ్ళలోకి తీసుకున్నాగానీ
ఇంకా ఏదో ఉండాలి.
కచ్ఛితగంగా ఉండే ఉంటాయి
అందుకే కళ్ళు విప్పారి మరీ వెదుకుతున్నాయి.
2
ఎన్నెన్ని సాయంత్రాలు..
ఎన్నెన్ని తీరాలు..
ఆ పాదముద్రికల అన్వేషణ
అలా కొనసాగుతూనే ఉంది
ఇంకా కానరానిదేదో
దోబూచులాడుతోంది
కాదు.. కాదు..
యిక్కడే ఏదో ఒకమూలన ఉన్నట్టే ఉంది
అస్పష్టంగా.. అతి సమీపంగా
కనిపించనని మారం చేస్తున్నట్టే ఉంది
మరోపక్క అంతేజాలిగా
నేనున్నానంటూ నమ్మకం కలిగిస్తోంది
3
చెవిదిద్దో, కాలిపట్టానో
కాలికి తగిలినట్టే ఉంది
దోసిళ్ళలోకి మళ్లీ ఆత్రంగా
ఇసుక మీటిన సవ్వడి. కానీ..
దోసిళ్ళలో ఉప్పు నీళ్ళ పరిహాసం
4
చీకటిపడింది
పడిలేచే కెరటాల
హోరు
చెవిని తాకుతోంది
అప్పటిదాకా తెల్లగా పాలుగారిన సంద్రం
నల్లగా మిలమిల మెరవడానికి సిద్ధమవుతోంది
ఇంకా కానరానిదేదో మిగిలే ఉందక్కడ
బాగా పొద్దుకూకింది
తీరమంతా వెన్నెలీనుతోంది
అలసిన ఒక్కొక్క అడుగు
సేదతీరేందుకు సిద్దమవుతోంది
5
దూరంగా ఎక్కడి నుంచో..
పూలపరిమళపు ఆఘ్రానింపు
నులివెచ్చని కలవరింతలో
చల్లగా దరిచేరుతున్న జోలపాట
నను యెరిగిన గాలిసమీరంలా
తెల్లార్లూ ముచ్చట్లే
ఒంటరిగానేవున్నా. కానీ
జంటగా ఉన్న ఫీలింగ్
యస్..
ఐ గాట్ యు!
అండ్.. ఐ ఫీల్ యూ!!

- గంగాధర్ వీర్ల