Saturday 29 October 2016

చెడ్డీలేసుకున్న రోజుల్లో..!!
'సిసింద్రీ'యే  పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌
...........................................
దీపావళి.. అనగానే.. ఎన్నెన్ని జాడలు.. ఎన్నెన్ని 'ఉత్ప్రేరక' కసరత్తులు. దీపాల పండగ ఇంకా రాకముందే.. అంటే నెల, నెలాపదిహేనురోజులకు ముందే.. మనలో చాలామందిమి. నిక్కర్లుపైకి ఎగేసిమరీ.. ''పీఎస్‌ఎల్‌వీ'' ప్రయోగానికి సిద్ధమైపోయేవాళ్ళం.
పీఎస్‌ఎల్‌వీనా..?! అవును మరి.. సిసింద్రీని పిఎస్‌ఎల్‌వీ అనక మరేం అనాలి? ఎంతో కష్టపడి, చెట్టులు.. గుట్టలు ఎక్కి.. గొడ్లచావిళ్ళలోకి దూరి.. చాటుగా మాటుగా సూరేకారం నూరి.. ఎండలో ఎండబెట్టి.. బొగ్గు పౌడర్‌, గంథకం కలిపి.. దాంట్లో.. ఐదు.. ఒకటి, పది.. రెండు చెమ్చాల చొప్పున.. లెక్కలు కట్టి ''మందుగుండు ఫార్మూలా''ను సక్సెస్‌ఫుల్‌గా కలిపి.. సిసింద్రీ దట్టించినప్పుడు, కలిగిన ఆ ఆనందాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరికైనా సాధ్యమా?! చెప్పండి.
సిసింద్రీ ఎగరాలంటే.. సిసింద్రీ గుల్ల కూడా బాగుండాలి. సినిమా వాల్‌పోస్టర్లు. దళసరి కాగితాలు ఎలాగోలా సంపాదించి.. నాలుగుపలకలుగా ముక్కలు చేసి.. వాటిని బుల్లి మిక్చర్‌ పొట్లం ఆకారంలో చుట్టి, అన్నం మెతుకులతో అట్టించినోడు అప్పుడు.. నిజంగానే హీరో కిందే లెక్క. ఇక ఆరిన గుల్లలోకి మందు గట్టిగా దట్టించి.. ఆరబెట్టిన సిసింద్రీలని అంటించి వదిలితే.. సర్రున గాల్లోకి ఎగిరితే.. నాకు మించిన మొనగాడు లేడనే.. ఫోజులు.. ఎక్కడికిపోతారు?!
నిక్కరు జేబులో పట్టినన్ని సిసింద్రీలు వేసుకుని.. తోటిపిల్లకాయలతో కలిసి. అగరొత్తు పుల్ల అంటించి.. మూతి దగ్గరకుపెట్టి ఊదుతూ, ఎంతో సాహసోపేతంగా.. సిసింద్రీలు అంటించడం.. ఒకరకంగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలాంటిదే.. నాలుగు మెలికలు తిరిగి ''జ్జప్‌..'' అంటూ సిసింద్రీ గంతులేస్తూ.. పాము ఆడినట్టు ఆడిందో.. రెండోక్లాసు, మూడోక్లాసు చదివే బుడ్డోళ్ళు నిక్కర్లు గట్టిగా పట్టుకుని.. అక్కడ్నుంచి పరుగే పరుగు.
అలా.. నిక్కర్లు వేసుకునే వయసులో.. దీపావళి వెలుగురవ్వ.. ఓ సిసింద్రీ అయ్యింది. బుడిబుడి పాపాయి చేతుల్లో చమ్కీలు చల్లిన ఓ తాడయ్యింది. హైస్కూల్‌ కుర్రాడి చేతిలో.. ధైర్యం విసిరిన రాకెట్టు మాదిరి.. ఆకాశానికి ఎగిరే తారాజువ్వ అయ్యింది.
ఇంకా.. అమ్మ, అక్క, చెల్లాయి చేతిలో విరిసిన మతాబుపూల వెలుగులు.. నాన్న పేల్చిన తాటాకు టపాసులు.. ఇరుగిల్లు పొరుగిల్లని లేకుండా అందరినీ కొండంత వెలుగులతో ఏకం చేసిన చిచ్చుబుడ్లూ.. ఇలా దీపావళి కాంతుల్లోకి తరచి చూస్తే గుక్కతిప్పుకోని అను భవాలు చాలానే ఉంటాయి. అందుకే.. ఈసారి వెలుగుల పండగ.. కొంచెం కొత్తగా.. ఇంకొంచెం అర్థవంతంగా.. మరికొంత ఆదర్శంగా జరుపుకుందాం!! మన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ..
-గంగాధర్ వీర్ల

Thursday 27 October 2016


పాద ముద్రికలు
...............

తీరం వెంబడి
నడిచేటప్పడు
మనసుకి కనిపించే
ముద్రలన్నీ ఒకేలా ఉండవ్
కొన్ని అడుగులో అడుగు వేయిస్తాయి
ఇంకొన్నిసుదూరంగా ఎక్కడికో నడిపిస్తాయ్
కొన్ని ముద్రలు
పదే పదే వెంటాడతాయ్
కొన్ని తిరిగి వెంటాడేలా చేస్తాయ్
అక్కడ సాగే నడక ఒక్కటే కావొచ్చు
గుండెల్లో ముద్రించుకునే ముద్రలు మాత్రం అనేకం
కొన్ని..సముద్రపు అలల్లా..
దగ్గరగా వస్తుంటాయ్
మరికొన్ని దూరంగా పోతూ ఉంటాయ్!!
-గంగాధర్ వీర్ల

Wednesday 12 October 2016



::కొత్త కూడికలు::
.........................
ఏమయ్యిందో ఏమో?!
అక్కడన్నీ రాతివనాలే
ఇసుమంతైనా పచ్చికలేని..
ఎడారి దేహంలా..
దిక్కులేని పక్షిలా..
దారి దొరకదు,
గమ్యం తెలియదు
ఆలోచనల్లోనూ జీవంలేదు
000
ముడుచుకున్న
వేళ్ల సందుల నుంచి వచ్చే
మెటికల శబ్ధంలోనూ
ఓపికలేని నిశ్శబ్దమే.
గమ్యంతోచని తనవు..
నిస్తేజంగా కూలబడుతోంది.
ఎటు చూసినా అంతా అనిశ్చితి
000
సరిగ్గా అప్పుడే
ఎక్కడో నుంచో
చుట్టంచూపుగా వచ్చి
సన్నపాటి గాలితెర భుజాన కప్పుతోంది
కొత్తదారి చూపుతానంటూ..
గుండెలపై వాలిన
వాన చినుకేమో..
బిడ్డను అక్కున చేర్చుకున్న తల్లిలా
లాలనవుతోంది.
తలపైకెత్తి ఆకాశంకేసి చూస్తే
గుంపులు గుంపులుగా
తామెరిగిన దేశానికి
హుషారుగా వలసపోతున్న
పక్షుల కేరింతల సమూహం
.....
మనసులో చిటికెడు
సానుకూల దృశ్యం
కూలబడిన మనిషి రెక్కల్లో
నూతనోత్సాహం
000
దేహంలో కొత్త కూడికలు
వడివడిగా అడుగులు వేస్తున్నాయి
అతడిప్పడు..
దిక్కులు తెలిసిన మనిషి
ఎగురుతున్నపక్షిలో
తనని తాను చూసుకుంటున్న
మరో కొత్త మనిషి!!
-గంగాధర్ వీర్ల

Sunday 9 October 2016

జీవనది
................
కంటికి బరువెక్కువ
పైకి ఇంకినట్టే కనపడుతుంది.
నలుగురి ముందు
నిండుకుండలా.. గంభీరంగా
తొణకనట్టే ఉంటుంది.
సమయం వస్తే మాత్రం
కట్టలు తెంచుకుంటుంది
గుండెల్ని చీల్చుకొచ్చే కన్నీటికి
ఆనకట్టలేయడం ఎవరి తరం కాదేమో!?
కంటికి బరువెక్కువ
భావోద్వేగాల బరువూ ఎక్కువే
ఇన్ ఫ్లో.. అవుట్ ఫ్లోల..
కొలతలు, కొలమానాల్లేని
ఓ అంతర జలపాతం
-గంగాధర్ వీర్ల, 09-10-16