Saturday 8 July 2017

వాన- అమ్మ చీరకొంగు
..............
నిన్న సాయంత్రం
గుండెలపై కురిసిన వాన
ఇంకా తడితడిగానే తగులుతోంది
వస్తున్నానని చెప్పకుండానే
బంధువులా వచ్చిపోతున్న వానలో
ఎన్నెన్ని పార్శ్వాలు
చేతులు చాచి.. ఆ మాంతంగా హత్తుకుని
నిలువునా తడిచిపోయేలా చేసే వానలో
చాలా గమ్మత్తులే ఉన్నాయి
000
చూరు కింద నిలబడి చూస్తే
వాన పెట్టే కుంపటి అంతా ఇంతా కాదు
తడిసిన పొయ్యలో కట్టెలు మండవు..
కాయంకష్టం చేసే పొట్టలో ఆకలి తీరదు
చెప్పాపెట్టకుండా వచ్చేవాన..
పేదోడి ఇంటిలో ఆకలికి సంకేతం
000
అక్కడేమో!?
వాన.. ఖరీదైన కాఫీషాపుల ముంగిట
స్టయిలైజ్డ్ గా.. నాట్యమాడుతూ..
వేడివేడిగా పొగలు చిమ్మతూ.. వయ్యారాలు పోతుంది
ఇక్కడేమో!?
వానరేపిన చల్లని సెగతో
బాల్కనీలో కాలం తెలియని కబుర్లు
ఇంకోచోట
కుండపోత వర్షంతో పోటీపడుతూ
కాక్ టైల్.. మైమరపు మత్తులు
000
అదిగో అక్కడ .. వానొస్తే
అక్షర సమూహాలు .. వళ్ళంతా కళ్ళు చేసుకుని
చిటపట చినుకుల్లో
తమ స్వాప్నిక లోకంలో పూచే..
పూల గుభాళింపును వెదుక్కుంటూ..
వానరాకడ, పోకడలలో
చెట్టు చేమల పరవశాన్ని
మెలకెత్తే విత్తుల్లో మర్మాన్ని
గుండెల్లోకి హత్తుకుంటూ
సిరాచుక్కలుగా .. భావయుక్తమవుతున్నాయి.
000
మరోచోట
ఎట్టకేలకు..వానొస్తే..
బీడుభూమంతా ఆవురావురమంటూ
విచ్చుకున్న పచ్చని పరుపవుతుంది
కరిమబ్బుల్ని దాటుకుంటూ
భూమిపుత్రుడి ఇంట
సిరులుపొంగే ధాన్యపు గింజవుతుంది
00
ఇంకా ఇంకా అనేక చోట్ల
వాన.. ఆ వానలో దాగున్న జాడలెన్నో
కాసేపు కురిసినా
రాత్రంతా కుమ్మరించినా
వరదైనా
వాగైనా
వానలో.. అందనంత జీవితసారం
వాన.. ఓ సంతోషం
వాన ఓ భావోద్వేగం
అంతేకాదు,
వాన.. కన్నీటి తెరను కప్పి పుచ్చే
అమ్మచీరకొంగు
-గంగాధర్ వీర్ల

Friday 23 June 2017

రాత్రి-పగలు- ఓ మిణుకుమనే చుక్క

................
తెలతెల్లారుతున్నప్పుడు
ఆకాశాన చుక్కలు
మిణుకుమిణుకుమంటూ
కనీకనపడనట్టు
మనిషితో దోబూచులాడుతుంటాయి.
ఒసేయ్.. ఒరేయ్.. రేయ్
కనీసం జీవితంలో సగభాగమైనా
చీకటిని చీల్చుకుని
కాసేపు వెలుగులో బతకండర్రా..!! అనేమో!?
000
రాత్రంతా మేల్కొని..
కళ్ళింత చేసుకుని
ఆకాశయానం చేస్తూ
తదేకంగా చూసిన ఆ చుక్కల్ని
పగటిపూట భగభగమండే
సూర్యుని గుండెల్లోంచి
వెదికి పట్టుకుని ఎలాగూ చూడలేం.
కానీ, మనసు విశాలమైతే
కాసేపు ఓపికతో ఉండగలిగితే
పగటిపూట కూడా మంచుకొండ
మన గుండెలపై చల్లగా కురవొచ్చు
000
చల్లని వెన్నెల్ని వొళ్ళంతా చిలకరించేది ఒక్క రాత్రి మాత్రమే కాదు,
పగటిపూటలోనూ..  నిస్పృహదేహాన్ని చుట్టుకున్న గుండీలు విప్పి
మనసంతా వెదికిచూసుకుంటే నిండా చల్లదనమే
అందుకేనేమో
వెచ్చని దేహంతో
మళ్ళీ చీకటయ్యేదాకా
పరివర్తనంగా మెలగమని
ఆ వేకువ చుక్క మిణుకుమిణుకుమంటూ
నావైపు తిరిగి చెప్పినట్టుగానే ఉంది
000
అలా గడియారపు ముళ్ళను
అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నానో లేదో..
ఒకపొద్దు గడిచింది
పగలు.. తన అస్తిత్వాన్ని విడుస్తూ పడమర దిక్కుకు
కొంచెం కొంచెం కుంగుతోంది
అదే సమయంలో
ఉదయంపూట వెళుతూ వెళుతూ
మిణుకుమిణుకుమన్న ఆ నాలుగు చుక్కలు..
తిరిగి సాయంత్రానికళ్ళా
కొత్త వెలుగుతో
ఆకాశమంతా విప్పారుతూ
సంతోషంగా మెరుస్తున్నాయి
మనిషి జీవితపు చక్రంలో
చీకటి వెలుగుల్లా!!
-గంగాధర్ వీర్ల

Sunday 18 June 2017


:: Musing::

నిన్నొక..
జ్ఞాపకంగా మాత్రమే చూడలేను
ఎందుకంటే..
నువ్వసలు జ్ఞాపకమైతే కదా?!
కలలోకూడా
మరుపివ్వని
తియ్యని నిజం!!
-గంగాధర్ వీర్ల
మ్యూజింగ్స్:
ఆకాశవీధిలో నడక
...............
అప్పడుప్పడు
ఆకాశంలోకి తొంగిచూస్తూ ఉండాలి
ఏమో.. అల్లంత దూరం నుంచే
వెన్నెలమ్మమాటాడొచ్చు
నింగిలో వేలాడే ఆ చుక్కలన్నీ ఏకమై
బుగ్గన చుక్కలా..
మిలమిలా మెరవనూవచ్చు
000
అక్కడ
మేఘాలవీధుల్లో
తేలియాడాలంటే
ఇక్కడ నుంచే
కాసిన్ని మల్లెల్ని
గుండెల నిండా తురుముకుని
ప్రేమగా తీసుకుపోదాం
000
అదిగో..
వానొచ్చేట్టుంది
నల్లని కరిమేఘపు చినుకు..
ఏ అచ్ఛాదనలేని
నా వొంటిపై బోర్లాపడి
చిత్తడి చిత్తడి చేస్తోంది
000
కాసేపు వెలుతురు
మరికాసేపు.. చిమ్మచీకటిని
వళ్ళంతా కప్పుకుంటూ
ఒకటే సిగ్గుపడుతున్న
అర్ధచంద్రాకారుడు
అక్షరాలు కూర్చి
ఏదో ఒక పాటపాడమని ఒకటే గొడవ
000
భలే ఉంది..
ఆకాశంలో.. ఈ ఒంటరి నడక
పేరుకే ఒంటరితనం
అడుగులో అడుగై
తెల్లార్లూ..నాతో ఎవరో
కలివిడిగా.. జతగా నడుస్తన్నట్టే ఉంది
000
 అందుకే అప్పడప్పడు
ఆకాశంలోకి తొంగిచూస్తుండాలి
ఆనక అదరమరచి అక్కడే
చల్లని ఆకాశతీరంలో
హాయిగా నిద్రపోవాలి!!
-గంగాధర్ 

మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
..................................


చేతి సంచిలో 
ఎక్కాలబుక్కు, తెలుగువాచకం, రూళ్ళబుక్కు 
ఓ చెక్కపలక.. నాలుగు ఇరిగిపోయిన కనికలు
నటరాజ్ జామెంట్రీ బాక్సులో రెండు రేగొడియాలు
అప్పుడు అవే..
కోట్లగుమ్మరించి.. ఆకాశానికెదురేగి
రెక్కలకట్టుకుని.. పాలసముద్రాల్లో
తేలియాడుతూ.. జలకాలాడుతూ
బడిగంట సాక్షిగా.. బుల్లి చేతులతో ఒడిసి పట్టుకున్న
కేరింతల సమూహాలు
000
అప్పుడు
అ.. ఆలు దిద్దడం ఎంతతేలికో..
ఇంటిబెల్లు కొట్టేదాకా..
అమ్మ.. ఆవు.. ఇల్లు.. ఈగ
బండిరాలు.. గుండ్రంగా తిరగాల్సిందే
పలకైనా అరగాలి.. కనికైనా ఇరగాలి
ఎవరూ చూడకుంటే..
బుల్లి కనికిముక్క కొరుక్కుని
తినేయాలి.
పలకను దిద్దే పిండిలాంటి నల్లని కనిక
బడిలో చప్పరించే అవకాయ బద్దలాంటిది
అబ్బా.. తలచుకుంటే..
ఆ రుచే గమ్మత్తు.
0000
అప్పుడు
లేత భుజాలపై బరువుల్లేవు
టైలర్ కుట్టిన చేతిసంచిలోనే
తేలిగ్గా బడిచదువు సాగేది
బడిగంట ఇంటిదాకా వినపడేది
బడిగంటంటే పిల్లకాయలకే కాదు
పెద్దోళ్ళకూ వినడానికి ముచ్చటే
000
అప్పుడు బడంటే
తలకింత నూనె రాసుకుని
పళ్ళు, కళ్ళు మాత్రమే కనిపించేంత
మైసూర్ శాండల్ పౌడర్ మొఖానికి రుద్దేసి
చద్దన్నంలో బెల్లంముక్కో..
ఉల్లిపాయముక్కో నంజేసుకుని..
ముక్కెగరేసుకుంటూ
నాసామిరంగా
బడికెళ్తా ఉంటే..
నేలమీద
పచ్చగా విచ్చుకున్న పచ్చికపై
పావురాలు గుంపులా ఉండేది.
000
అప్పడు..
బాబ్డ్ హెయిర్ లు లేవు
మెడపైకి కత్తిరుంచుకున్న తలకట్టులూ లేవు
ఉంటే గింటే.. రెండుజెళ్ళ సీతాళ్ళు
ఉంగరాల జుట్టున్న మంగతాయార్లే
000
అప్పడది
లేతమనసుల్ని
ప్రేమగా కౌగిలించుకుని
నాలుగు లక్షణమైన అక్షర ముద్దల్ని
తినిపించే అక్షరాలసావిడి
లోకం తెలియని బాల్యంలో
రోజంతా..
కాసిన్ని నక్షత్రాల్ని
కాసిన్ని ఆటల్ని
కాసిన్ని పాటల్ని
ముద్దాడుతూ గడిపేసిన రోజులవి
అందుకే..
మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
-గంగాధర్ 

మ్యూజింగ్
............
ఇలా వచ్చి
అలా వెళ్ళిపోడానికి
నేనేమీ.. చుట్టాన్నికాదు
నీలో ప్రేమ పుట్టకను!
-గంగాధర్ వీర్ల

Friday 26 May 2017




వానొచ్చింది.. కానీ..?!
............................
పగోడిలా ఉరుముతూ
శత్రువులా ఘీంకరిస్తూ..
పెళపెళమంటూ
పెద్దపెద్ద అంగలతో
కొండంతలు దాటి
కరిమబ్బుల్నిఎలాగోలా చీల్చుకుంటూ
పిడుగుపాటు గద్దింపుతో
వానొచ్చింది
000
ఊరు ఊరంతా హోరై
చెట్లు చేమలు కకావికలమై
ఫలానికొచ్చిన పంటను
నిలువునా కూలిపోయేలా చేస్తూ
పేదోడి గుడెసెల్ని పీకి పందిరేస్తూ..
మొత్తానికి వానొచ్చింది
000
చిత్తడి చినుకుల కోసం
నెర్రలు చాసిన భూమితల్లీ
కడుపారా తడవనేలేదు
చల్లని సాయంకోసం నోరుచాచి
ఎండిన ఆకులతో..
వాడి..రాలిపోతున్న
చెట్ల దాహమూ తీరలేదు
మొత్తానికి వానొచ్చింది
000
వొళ్ళంతా ముళ్ళకంచెలా
చుట్టేసుకున్న ఎండ గుబులుకు
ఇన్స్టంట్.. పెయిన్ రిలీఫ్
మందుపూతలా..
కాసింత చల్లదనం తాకగానే..
తనువులో కాసేపు మైమరపు
విద్యల్లత పెళపెళల సాక్షిగా
ఆకాశం నుంచి
బాల్కనీలోకి వాలి.. జారి
ఐస్ ముక్కలా రాలిపడ్డ
కాసిన్నిచిటపటలకు పిల్లల కేరింత
000
ఎట్టకేలకు
బడబడమంటూ
గుండెలదిరే శబ్దాలతో
వానొచ్చింది. కానీ
ఏంటో మనసుకి
తృప్తేలేదు!!
-గంగాధర్ వీర్ల

Thursday 25 May 2017



::మల్లెపూలు.. మల్లెపూలోయ్!! ::
Model: My dear better half Anju
.......................................
అనగగనా ఒకరోజు.. అది ఎండాకాలం
పొడవాటి పూలజెడ వేసుకుని..
ముఖానికి ఇంత పాండ్స్ పౌడర్ రాసుకుని..
కళ్ళంతా కాటుక పూసుకుని..
ఫ్రెండు.. సీతాలును చెలికత్తెలా వెంటేసుకుని..
ఆ సీతాలుతోనే.. భూమికి తాకే మల్లెపూల జడను..
ఫొటో స్టూడియోదాకా మోయించి.
అయిదడుగుల అద్దం ముందు..
పీటెక్కి మరీ.. పోజివ్వడం..
ఆ ఆడపిల్లకైనా మరపురాని జ్ఞాపకం
నిన్నటి రోజుల్లో
మల్లెపూల వాలుజెడ వయ్యారం
ఆ వయ్యారంలో దాగిన సింగారం
ఆ సింగారంలో.. వాలుజెడను మోస్తూ..
సిగ్గుల మొగ్గలయ్యే..మన బంగారాల
మురిపాలు అలాంటివి
000
అసలు..మల్లెపూలంటే..
అమ్మాయిలకు ఎంత ఇష్టమో..
అబ్బాయిలకూ అంతే ఇష్టం.
గౌన్లు, నిక్కర్లు వేసుకునే వయసు నుంచే..
మల్లెలతో మనకు అంతటి అనుబంధం ఉంటుంది.
అమ్మ సూది మొనలోంచి దారం తీసేందుకు..
ఇంకొక పక్కనున్న దారపు మొనను పంటిన బిగబెట్టి..
మల్లెమొగ్గల్ని ఒడుపుగా పట్టుకుని.. గుచ్చుతూ
నాలుగు మూరలు కళాత్మకంగా అల్లిన సందర్భాల్లో..
కళ్ళింత చేసుకుని.. అమ్మను తేరిపారా చూసిన జ్ఞాపకాలు
మనలో చాలామందికి గుర్తే.
000
అప్పట్లో... పూలజడ ఫొటోలేని
ఫోటో స్టూడియో ఏదైనా ఉందంటే..
అదొక పెద్ద వింత.
''మల్లెపూలు.. మల్లెపూలే!'' అంటూ..
వీధి చివర మలుపులో
పూలబ్బాయి.. గొంతువినపడగానే..
అమ్మకంటే ఆత్రంగా..
''అమ్మా పూలబ్బాయి వస్తున్నాడే..!'' అని..
అమ్మకు గబాగబా సమాచారం చేరవేయడంలోని మజా
మనకి ఇప్పటికీ గుర్తే.
000
మల్లెలు తల్లో పెట్టుకుని..
అమ్మాయిలెంత మురిసిపోయేవారో..
మల్లెలు తెచ్చే పరిమళపు సందళ్ళతోనూ..
ఊరు.. ఊరంతా అలాగే మురిసిపోయేది.
సొగసు చూడతరమా!!
ఆ వాలుజెడల చిట్టెమ్మల సొగసు చూడతరమా!!
-గంగాధర్ వీర్ల

Thursday 13 April 2017

ఆవేశం..!
నిత్యగమన కవాతు
....................
చండ ప్రచండమై
ప్రజ్వలితమై
ఎర్రని కాంతియై
ఆకాశాన్ని తాకేలా
పైపైకి ఉబికినప్పుడే
అగ్నిపర్వతం బద్ధలయ్యేది
000
వేలకోట్ల సుదూర తీరాలను 
దాటుకుంటూ.. పరుగెడుతూ
రాత్రిపగలు..చెలరేగి 
ఎగసిపడ్డప్పుడే
సముద్రపు
కెరటాల జాడ తెలిసేది
000
గుండెలోతుల్లోని ప్రేమను 
మదించి
పరవశించి
నరనరాన 
తన్మయత్వం సాగిస్తూ
రెండు శరీరాలు 
ఏకమైనప్పుడే
మనిషి పుట్టేది
000
ఆవేశంలేకుంటే
భూమిలేదు.
భూమిపై విత్తులేదు
విత్తులోంచి పుట్టే మొలకలేదు
000
ఆవేశం
అనేక అనేక ఆవిష్కరణలకు పునాది
అనేకనేక ఉద్యమాలకు నాంధి
అనేకఅనేక పోరాటాలకు వెలుగుదివ్వె
000
ఆవేశం
కోట్లాది పరమాణువుల శక్తిని
నింగిలోకి తీసుకెళ్ళే ఆయుధం
ఆవేశం
నిత్యనూతన
విద్యుల్లతా సమూహం
000
ఆవేశం
బానిస సంకెళ్ళను తెంచిన
స్వాతంత్ర్యం
ఆవేశం
సమసమాజాన్ని వెలుగెత్తి చాటిన 
అనేక వాదాల సమూహం
000
ఆవేశం 
వెయ్యివసంతాల అక్షరసేథ్యం
ఆవేశం..
లెక్కకుమించి నిద్రలేని రాత్రుల
అంతర్మధనం
ఆవేశం
మరోకొత్త ఆవిష్కరణకు
ప్రారంభ సంకేతం
000
ఆవేశం మనోవైకల్యం కాదు
మనోజ్ఞఫలకాలను
చైతన్యపరిచే
నిత్యగమన కవాతు!!
000
ఆవేశం
మనోవైకల్యం కాదు
మానసికవికాసం
ఎందరికో దారిచూపే
ధర్మాగ్రహం
-గంగాధర్ వీర్ల

Tuesday 4 April 2017

నిక్కరు-ఊరు-పానకం
..........................
బెల్లం పానకం
వడంపప్పు
వీలైతే చలివిడి కోసం
ముందే రోజు
పిల్లకాయలం
సవాలక్ష స్కెచ్ లు
మరచెంబు కంటే పెద్ద చెంబు
ఎక్కడుందా? అని.. ఇల్లంతా వెదకడం
అమ్మ చుట్టూ తిరిగి..
రకరరకాల చెంబులు పోగేయడం
స్టీలు క్యారేజీలు
లోటా చెంబులు
పెద్ద పెద్ద గలాసులు..
పానకపు వేటకు సిద్ధమయ్యాయి
000
తెల్లారింది.
రాములోరిగుడికాడ.
చలువ పందిళ్ళు.. మామిడి తోరణాలు
మైకులో లవకుశ, సంపూర్ణరామాయణంలోని
సినిమా పాటలు
ఇంట్లో.. మా పిల్లకాయలందరికీ
వళ్ళంతా.. తలారా స్నానాలు.. వీలైతే కొత్తబట్టలు
లేకపోతే.. ఇస్త్రీ బట్టలు
000
రేడియోలో.. భద్రాద్రి సంబరాలూ
బ్రేక్స్ లేకుండా అప్ డేట్స్
రాములోరి పెళ్ళికూడా అయ్యిందట
ఊరిగుడిలోనూ భాజాలు, మంత్రాలు.
రేయ్.. ఇక పొండర్రా.. అనగానే
ఇక పానకవేట ఒక్కటే మిగిలింది
ఊళ్ళో ఎండ పెరిగింది
శ్రీరామనవమిరోజు
ఎండబాగా కాస్తందట
అమ్మమ్మ చెప్పింది.
అయితేనేమీ..
నిక్కర్లు, గౌనులు.. కుదుమట్టమై
గుడికాడికి తీపిరాగాలు తీస్తూ
హుషారుగా పరుగెత్తాయి
000
పెద్ద పెద్ద గుండిగపై..
చల్లటి నీళ్ళతో కప్పిన తెల్లటి వస్త్రం.
మిరియాలు కలిపిన బెల్లంపానకం
చల్లంగా ఉండాలని ఐస్ ముక్కలు
గుడి ప్రాంగణమంతా తీపివాసనే
అంతే.. పానకం పోయడం మొదలైంది..
మా చెతుల్లోని చెంబులన్నీ
పానకం కోసం
ఎగబడ్డాయి.. పోటీపడ్డాయి
చెంబు నిండా పానకం ఇంటికొచ్చింది
ఎవరెస్ట్ శిఖరం ఎక్కివచ్చి
బిడ్డడు ఎంతో కష్టపడి
రాములోరి పానకం తెచ్చాడబ్బా అన్నంతగా
అమ్మమురిపెం
చెంబులో పానకం.. పెద్ద గిన్నెలో గుమ్మరింపు
తలోకాస్త అమ్మ వడ్డింపు
చెంబు కాలి అయ్యింది.
మళ్ళీ రాములోరి గుడి గుర్తొచ్చింది
ఒకటా.. రెండా..
గుండిగల్లో పానకం ఉన్నంత వరకూ
విసుక్కోకుండా పానకం పోస్తున్నంత వరకూ
మా పిల్లకాయల చెంబులో
పానకం ఖాళీ అవుతూనే ఉంది
000
రాములోరి గుడికాడికి
పరుగులు తీయించిన పానకం
కేవలం పానకం మాత్రమే కాదు..
తిరిగిరానీ మధురమైన జ్ఞాపకం
మళ్ళీ ఊరెళ్ళి
నిక్కరేసుకుని
రాములోరి పానకం కోసం పరుగెత్తాలని ఉంది
-గంగాధర్ వీర్ల

Wednesday 8 March 2017

::పూల గుసగుసలు::
.........
ఆ పూలతోటలో
రకరకాల పూలు
అనేకనేకాల పరిమళాలు
కానీ, వాటి గుండెల్లో
లెక్కకుమించి ఆలోచనలు
000
ఏ సిగలో వాలాలి?
ఏ దేవుడి మెడలో హారమవ్వాలి
ఏ శృంగారపు పందిరి నీడలో
మోహమై నలిగిపోవాలి?
ఏ.. ఉన్నాదపు ముంజేతిపై
బిక్కచచ్చిపోవాలి?
ఏ దోసిళ్ళలో ఇమిడి
నాలుగు అక్షరమాలలుగా
అల్లుకుపోవాలి?
000
ఆ పూలన్నీ..
తమ పూలవనాలను దాటుకుంటూ
ఒక్కొక్కటిగా
మొండితలకాయలవుతున్నాయి
000
పూలఅంగడిలో
అందంగా సింగారించుకుని
ఏ గూటికి చేరాలో తెలియక
వాడిపోని వదనంతో
గుసగుసలాడుకుంటున్నాయి
-గంగాధర్ వీర్ల

Tuesday 24 January 2017


మట్టి మనిషి
ఏ నాగలి దున్నిన
కష్టమో..
చెమటై
మొలకై
వడ్డై
పళ్లెం నిండై
ఆకలి తీరుస్తోంది.
-గంగాధర్ వీర్ల


Wednesday 18 January 2017


LIFe is a Cycle 
………………………….
చీకటిని చీల్చుకుంటూ
వెలుగు నింపిన సూర్యుడ్ని
ఇక.. తెల్లారిందిలే అని
కాలుతో తన్నినట్టు..
అక్కడ స్వార్థం
వికటాట్టహాసం చేస్తోంది
000
రోజంతా గడిచాక
మళ్ళీ చీకటి రాకపోదు..
మరోసారి వెలుగుపూల వర్షం..
నిండుగా వర్షిస్తేగానీ..
అక్కడ పేరుకుపోయిన అజ్ఞానానికి
ప్రకాశంరాదు, లేదు. ఉండదు
Because of Life is a Cycle
000
అహం.. వ్యక్తిగతం.
స్వార్ధం.. ప్రాపంచికం
రెండూ నిలువెల్లా విషాలే
Don’t be Selfish, And
Don’t be Ignore any one
-గంగాధర్ వీర్ల


Thursday 12 January 2017


ముగ్గు-అనేక దృశ్యాలు
.............................
దృశ్యం1:
వాకిట్లో అమ్మ ఎంతో ఓపిగ్గా ముగ్గేస్తుంటే.. అలాగే రెప్ప వాల్చకుండా.. కళ్లు విప్పార్చి మరీ చూడాలనుకునే ఆ గౌనేసుకున్న అమ్మాయికెంతో మరిపెం. 'అమ్మకు ఇంతలా అద్భుతాలు చేయడం కూడా తెలుసా..?' అని మొదటిసారి అమ్మ గురించి గొప్పగా తెలియజేసేది, తెలియచెప్పగలిగేది మన ఇంటిముగ్గే. ఏ ఇంట్లోనైనా అమ్మకు తోడుగా ఉండేది ఎక్కువుగా ఆడకూతుర్లే. ముగ్గును పంచుకునే విషయంలోనూ అలా.. అమ్మకు సాయంగా, నాలుగు చుక్కలు కలపాలని ఆరాటపడే అనుభవంలో ఉండే అందమే వేరు.
'వద్దమ్మా..!! చుక్కలు పాడవుతారు..!' అని అమ్మ వారించినా.. ఏదో ఒక వరుసలో చుక్కల్ని కలపాలనేదే అమ్మాయి ముచ్చట. ఏరికోరి.. గుండ్రంగా చుక్కల్ని ఆనుకుంటూ అచ్చం అమ్మగీసే ముగ్గు గీతల్లా రావాలంటే.. ఆ అమ్మాయికి అంత సులభంగా కుదిరే పనేనా?!
''సరేలే చిన్నీ..! నేనిక్కడ ఈ ముగ్గు వేస్తాలేగానీ.. నువ్వు.. అదిగో అక్కడో బుల్లి ముగ్గు వేసేరు మరి..!'' అని అమ్మ వేసిన, వేస్తున్న పెద్దముగ్గు ఏమాత్రం చెదిరిపోకుండా, రక్షణ కవచంగా చెప్పే మాటల్లో మర్మం ఏదైనా.. అమ్మ మరో ముగ్గు వేయమన్నందుకు.. అమ్మాయికొచ్చే సంతోషమే వేరు. అలా.. అమ్మ శిక్షణలో అమ్మాయి ముగ్గు ఇంతింతై, హరివిల్లై ఆనక రథం ముగ్గేసేదాకా.. పట్టు సాధించి.. ఆపైన.. తనో అమ్మగా.. బ్రహ్మాండమైన చుక్కల ముగ్గుగా ఎదుగుతుంది.
దృశ్యం2:
వాకిట్లో అమ్మ ముగ్గేస్తుంటే.. ఇంటిగేటు పట్టుకుని వేలాడే ఆ అబ్బాయికీ.. ముగ్గులు చూస్తే భలే సంబరం.. ఆశ్చర్యం.. ''అమ్మకు ఎంత ఓపికబ్బా..! నేలమీద ఎన్నెన్ని చుక్కలు.. అవన్నీ లెక్క పెట్టాలంటే.. అయ్యబాబోరు కష్టమే.. చూస్తుంటే అమ్మకు లెక్కలు బాగా తెలుసనుకుంట.. వేళ్ళతో గుణించుకుంటూ.. చకచకా లెక్కలు తప్పని చుక్కలు శ్రద్ధగా పెట్టాలంటే.. ఎన్ని ఆల్‌జీబ్రా లెక్కలు రావాలి..? ఎన్నెన్ని 'ఏప్లస్‌బీ హోల్‌స్క్వేర్‌' సూత్రాల్లో పట్టు సాధించాలి..? అమ్మ ఒట్టి అమాయకంగా కనిపిస్తుందిగానీ.. అంతటి గణిత ప్రావీణ్యం ఉండే ఉంటుంది. లేకపోతే చుక్కలు పెట్టి.. కాగితం, పెన్ను, రబ్బరు లేకుండా.. ఇన్నిన్ని రేఖా చిత్రాలు ఎలా గీయగలుగుతుంది..?'' అని అమ్మను లోపల ఎంత గొప్పగా మెచ్చుకుంటాడో ఆ అబ్బాయి.
దృశ్యం3:
''పొరుగింటావిడ పెట్టిన ముగ్గు ఎంత బావుందో..? ఏమైనా సరే.. ఆవిడకంటే మంచి ముగ్గు పెట్టాల్సిందే. వీధి వీధంతా.. నా ముగ్గు గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే..!'' అనే పోరాటపటిమ మధ్య మన వీధుల్లో, మన ఇంటి వాకిట్లో అందంగా విచ్చుకునే రంగవల్లుల గురించి ఏమని చెప్పాలి..? ఎంతని చెప్పాలి..? ఆ ఇంటిమీద కాకి.. ఈ ఇంటిమీద వాలకపోవొచ్చుగాక.. పొరుగింటి ఇళ్ళను.. ఆ ఇళ్ళల్లోని మనుషులను.. కలగలుపుతూ అల్లుకుపోయే రథం ముగ్గు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అందుకే ముగ్గు ఇరుగుపొరుగు అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే చాకచక్యంగల రథసారథిó.
దృశ్యం4:
పుడమిపై అరవిరిసిన శ్వేతవర్ణపు పూదోటే మన సంక్రాంతి ముగ్గు. వాకిట్లో కళ్ళాపు చల్లి.. చేతిలో ముగ్గుల గిన్నె ఉంటే చాలు.. ఎవరూ చేయి తిరిగిన చిత్రకారులకు తక్కువకారు. అంతకుమించి ఎక్కువే. పిండి చుక్కల్లో ఎన్నెన్ని చిత్రాలు. పరిమళించే పూలు, పలకరించే హంసలు, కొక్కొరోకో కోడిపుంజులు.. బుజ్జి బుజ్జి బాతులు.. భారీ అంబారీలు.. పురివిప్పే మయూరాలు, ఒంపులు తిరిగే లతలు, పారిజాతాలు, మిలమిల్లాడే మీనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ముగ్గుల్లో ఒదిగిపోయే ప్రకృతి పరవశం అంతా ఇంతాకాదు. చుక్కల్ని కలిపే గీతల్లో వణుకుండదు.. ఒంపుల్లో తిరిగే మెలికల్లో తడబాటుండదు. అద్భుతమైన చిత్రరాజంగా నేలపై పరుచుకునే వెన్నెల కురిసినట్లు మొదలై, ఆపై ఇంధ్రధనస్సు రంగుల్ని నింపుకునే ముగ్గు గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే.
చేతులు చాచి.. ముప్పై ఆరు వరుసల్ని కలుపుకుంటూ వాకిలంతా పట్టే పెద్ద ముగ్గు వేయాలంటే ఎంత ఓపిక కావాలి..? ఎంత నేర్పు కావాలి..? ఎంతటి కళాత్మక సృజనకావాలి..? ఎంత గణితం అబ్బాలి..? ముగ్గు కేవలం.. నేలపై విచ్చుకునే సంప్రదాయం మాత్రమేకాదు. తరుణీమణుల సృజనాత్మక ప్రతిభకు నిలువెత్తు తార్కాణం. మన ముగ్గు అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మతో ఉన్న అందమైన అనుబంధం.
- గంగాధర్‌ వీర్ల