Friday 27 November 2015

గేర్ మార్చండి బాస్!!

సహనం-అసహనం
ఈరెండింటి మధ్య పోటాపోటీ పోరాటం
సహనంలోవున్న లోతుల్నితడమకుండానే
ఓ పెద్దమనిషి ప్రకటించే అసహనం!
000
దేశంలో అసహనాన్నిప్రశ్నించే క్రమంలో
ఓ వీరావేశపు కవి
క్షణకాలం ఆలోచించలేనంత అసహనం!
000
సహనానికి-అసహనానికీ
మధ్యవున్న వ్యత్యాసాన్ని తేల్చుకోలేనంత
ప్రసంగాల అసహనం!
000
ఏదో జరిగిపోతుందనే అసహనం
ఏదీ జరగట్లేదనే అసహనం
ఇదేనోయి సహనమంటూ..రాతల్లో అసహనం
ఇలాగుందామోయంటూ..మాటల్లో అసహనం
00
చెప్పేది వినడానికి సహనంలేని అసహనం
జనంలోనివున్న సహనాన్ని..
సహించలనేనంత అసహనం!!
00
సహనం, అసహనానికి
మధ్య
తేడా తెలియని అసహనం!
సహనం-అసహనం ఇలా రెచ్చిపోయి..
కత్తులు దూసుకోడానికి లెక్కలు అనేకం
ఇదో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక
ప్రసహనం!!
-గంగాధర్ వీర్ల, 27-11-2015


Wednesday 14 October 2015

::కిటికీ::

వర్చువల్‌ 'రాజధాని'

               ''ఏందిరా వెంకట్రావ్‌.?! ఆకాశంలో హెలికేప్టర్లు అటు ఇటు తెగ ఎగిరిపోతా వున్నారు..?! మన ఊళ్ళోనేమో.. ఎర్రబుగ్గ కార్లు.. ఒకటే కురు..కురు..అంటూ తిరిగేస్తున్నరు.. ఏంటీ..ఇషయం?'' అంటూ తలకున్న తలపాగ ఊడదీసి స్టయిల్‌గా నడుముకి కట్టుకున్నాడు ఉద్దండపాలెం వీరాస్వామి. ''ఏందిరోరు.. ఒకటే ఎటకారమాడమాక.. అదేదో నీకు తెలుసన్న సంగతి మాకు తెలుసులేవోరు..'' అంటూ ఉరిమే కళ్ళతో చూశాడు వెంకట్రావ్‌. ''పర్‌ సపోజ్‌ నాకా విషయం తెలిసే అనుకో.. అసలు నీకేం తెలుసో చెప్పొచ్చుగా..'' అన్నాడు వీరాస్వామి. ''ఓరోరి ఈ మధ్య నీకు గీర బాగా ఎక్కువైందిరోరు.. సరేగానీ సీఎంగోరు ఉప్పాడ పంచె, చీరా సారే పంపారా?! పంపితే అవన్నీ సింగారించుకుని బయలుదేరు మరి. ఇక్కడ లంక పొగాకు చుట్ట కాలుత్తూ ఆకాశంలో సూత్తు గాల్లో తిరిగే హెలికాప్టర్లు లెక్కపెట్టుకోవడం ఎందుకూ? అదేదో తెలియనట్టు నాటకమాడ్డం ఎందుకు?'' ఒకింత కోపంతోనే అన్నాడు వెంకట్రావ్‌.
అలా అనగానే బావురమన్నంత పనిచేశాడు వీరాస్వామి. ''ఏందిరా వీరస్వామి ఇప్పటిదాకా.. ఆరడుగుల బుల్లెట్టులెక్క కనబడ్డోడివి ఉన్నపళంగా ఆముదం తాగినోడిలా నీరసపడి పోయావేందిరా?!'' జాలితో అడిగాడు వెంకట్రావ్‌. ''ఒరేరు.. సీఎం ఇట్టా అడిగాడో లేదో.. అట్టా ఎనకా ముందు ఆలోచించకుండా.. అమరావతి దగ్గర్లోవున్న నా రెండెకరాల భూమిని ఇచ్చేశానా లేదా..?!'' అంటుండగానే ''లక్షలొస్తాయని ఇచ్చావ్‌.. ఊరికే ఇచ్చావా? ఏంది?'' అని వెంకట్రావ్‌ అడిగేసరికి ''ఆ.. ఎవ్వరైనా ఊరికే ఇస్తారేంది? నాలుగు రూపాయలొస్తాయనే కదా ఇచ్చేది..'' అంటూ ధీర్ఘం తీశాడు వీరాస్వామి. ''మరెంకెందుకు ఏడుపు?'' అని వ్యంగ్యంగా అడగ్గానే ''భూములిచ్చిన రైతులకి పట్టుపంచె ధోవతి, చీరసారే ఇంటికి పంపిస్తానని ఆ మధ్య ప్రెస్‌మీట్లో సీఎం చెప్పాడా లేదా? వాటికోసం ఎదురుచూసి కళ్ళు కాయలు కాస్తున్నాగానీ ఇప్పటిదాకా వర్తమానం రానే రాలేదు. రైతులపేర్లు శిలాఫలకాలపైన చెక్కిస్తానని చెప్పినాడా లేదా? మరి నా పేరు ఎక్కడ ఏ నాపరాయి మీద చెక్కిస్తున్నారో చెప్పనే లేదు. మరి ఏడుపుకాక ఏమొచ్చేది..?'' అంటూ మరోసారి బావురుమన్నాడు వీరాస్వామి.
ఎలా ఓదార్చాలో తెలియక అక్కడ నుంచి డింగ్‌మంటూ వెళ్లిపోయాడు వెంకట్రావ్‌. ''నమస్కారం వీరాస్వామిగారు! రాజధాని శంకుస్థాపనకు సతీసమేతంగా విచ్చేసి, మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన'' అంటూ ఎవరైనా గవర్నమెంటోళ్ళు ప్రేమగా పిలుస్తారనే ఆశతో వస్తానన్న బంధువుల రాక కోసం ఎదుచూసినట్లు చూస్తూనే ఉన్నాడు పాపం ఉద్దండపాలెం వీరాస్వామి. పైన ఆకాశంలో హెలికాప్టర్లు, రాజధాని గ్రామాల చేను, చెలకల మధ్య వీఐపీ కార్లు ఊపిరాడకుండా ఇంకా తిరుగుతానే ఉన్నాయి.
***
''ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా సంస్కృతి సంబరాలు, ఆటపాటలు అదిరిపోవాలి. సభా ప్రాంగణమంతా తిరుపతి నుంచి వచ్చే వేలాది పండితుల వేదమంత్రాల ఘోషతో మారుమోగాలి. వీఐపీల స్వాగతాలు ''నభూతో నభవిష్యతి'' అన్నట్టుగా సాగాలి. అది చూసి 'అచ్చంగా ఇది హిందూత్వ బడిలానే ఉందే' అని పీఎం మోడీ గంతులేయాలి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుళ్ళుకుని చావాలి. హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌.. వీలైతే తెలంగాణావుడ్‌ నుంచి వచ్చే సినిమావోళ్ళు, పెట్టుబడులు పెట్టే బడా వ్యాపారులు ''వహ్వా... వహ్వా.. వారెవ్వా..'' అని పొగిడి పారేయాలి. అయినవాళ్ళకు వీఐపీ సూట్లు, కానివాళ్ళకు ప్రొక్లెయినర్లతో దున్నేసిన చేలల్లో గుడారాలు ఏర్పాటు చేయాలి. తినడానికి ఈవెంట్‌ సంస్థలు అందించే ఖరీదైన ఆహారపొట్లాలు, కాచి వడబోసిన కిన్లే వాటర్‌ బాటిళ్ళు పంచిపెట్టాలి. కార్యక్రమం ఆసాంతం రక్తికట్టించడానికి యాంకరమ్మల హోరు.. ఇంకా ఇంకా.. ఏర్పాట్లు అదిరిపోవాలెహా.! ఇదిగో ఖర్చుకి వెనకాడమాకండి. పది కోట్లా.. నలబై కోట్లా.. పోనీ వంద కోట్లా... ఎందుకులే పిసినారితనం. అప్పుచేసి పప్పుకూడు తినడం, పెట్టడం మనకు తెలిసిందే కదా.. 400 కోట్లు రౌండ్‌ ఫిగర్‌.. ఒకేనా?! రాజధాని శంకుస్థాపన కోసం అయ్యే ఖర్చు 400 కోట్లు రాసుకోండి సాంబ..!!
***
''లగ్గమెప్పుడ్రా మామా అంటే సంకురాతిరి పొయ్యేదాకా.. మంచిరోజే లేదన్నాడే.. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాగా'' అన్నట్టుంది మన బాబుగారి వరుస..'' అంటూ నిట్టూర్చాడు రంగయ్య. ''అరె రంగయ్యా..! ఎప్పుడూ లేంది మన సీఎంగోరి మీద సెటైర్లు వేస్తున్నవేందిరా..? ఏమైనా పార్టీ మారినావా ఏంది?'' అడిగాడు సోముడు. ''నిజం మాట్టాడ్డానికి పార్టీనే మారాలా ఏంది? అయినా పార్టీ మారడానికి ఇంకా టైముందిలే'' అనేసరికి ''అసలు ఏందిరా నీవరస.. ఇసయం చెప్పకుండా పెద్ద వేదాంతిలా మాట్లాడుతున్నావ్‌?'' మళ్ళీ రెట్టించి అడిగాడు సోముడు. ''అదే మరి.. నీకు ఈ రెండు మాటలు మాట్లాడినందుకే తిక్క తిక్కగా ఉంది కదా..?! బాబుగారు చేసేపనికి నాకెట్టా తిక్క రేగాలా?'' అంటు రుసరుసలాడాడు రంగయ్య. ''రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చు పెడతన్నాడంట..! అదేగా నీ కుళ్ళు..?'' అని రంగయ్య కోపానికి మరింత ఆజ్యం పోశాడు సోముడు. ''ఎవరైనా ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టి.. ఆ ఇల్లు కట్టాక.. సంతోషంతో నలుగురికి భోజనాలు పెడతారుగానీ.. ఇదిగో అమరావతి.. అదిగదిగో సింగపూర్‌.. అల్లదిగో జపాన్‌.. అంటూ ఆలూ, చూలూ లేకుండానే శంకుస్థాపన కోసం 400 కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుపెట్టేయడం ఎందుకంటా..?'' ఎదురుగా సిఎం ఉన్నట్లు, ఆయన్ని నిగ్గదీసినట్లు ప్రశ్నించాడు రంగయ్య.
***
400 కోట్లా.?! సోముడి బుర్రలోని కాలుక్యులేటర్‌ ఏవో లెక్కలు కడుతోంది. అంత డబ్బుతో ఎన్ని గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు కట్టొచ్చు? ఎన్నెన్ని గుంతల రోడ్లను బాగు చేయొచ్చు. ఇంకెన్ని ప్రభుత్వాసుపత్రుల్లోని సమస్యల్ని తీర్చొచ్చు? ఎన్ని గవర్నమెంటోళ్ళ బడుల్లో టారులెట్స్‌ నిర్మించొచ్చు? అంతెందుకు ప్రస్తుతం తాత్కాలిక రాజధానిగా వున్న విజయవాడ నగరంలోని డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి పూడుకుపోయిన ఎంత చెత్తను బయటకి తీయొంచొచ్చు..? ఇంకా ఇంకా చాలానే చేయొచ్చే కదా...!! ఇలా లెక్కలు సాగుతూనే ఉన్నాయి.. 'వర్చువల్‌' రాజధాని నిజమవ్వడానికి ఇంకెన్ని కోట్లు కావాలోనని..!!
-గంగాధర్ వీర్ల

Wednesday 7 October 2015


::కిటికి::  

పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం!


                 వస్తున్నాయి పిల్లలకు సెలవులొస్తున్నాయి. ముప్పొద్దులా చదివి చదివీ అలసిపోతున్న స్కూల్‌ చిన్నారులకు విద్యా సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చే సెలవులు ఆటవిడుపులవుతాయి. బడి నుంచి కాలేజ్‌ వరకూ వయసులో తేడాలున్నా సెలవులంటే చాలు వారి ముఖాలు ఫిలిప్స్‌ బల్బుల్లా ధగధగలాడతాయి. విద్యార్థిలోకం ఆశగా ఎదురుచూసే సెలవుల్లో దసరా హాలీడేస్‌ ఒకటి. మాగ్జిమమ్‌ పదిహేను రోజులు, లేదంటే మినిమమ్‌ పదిరోజులు ఎంచక్కా స్కూల్‌కెళ్ళే పనే ఉండదు. పుస్తకాలతో కిక్కిరిసిపోయి నెలకొకసారి పంచర్‌ అయ్యే ఉల్లిపాయ సంచంత బరువాటి బ్యాగ్‌ల మోతకు కాసేపు బ్రేక్‌నిచ్చే సమయమిది. 'వచ్చేస్తున్నారు వస్తున్నారు జగన్నాథ రథచక్రాలు!' అన్నట్టుగా 'వచ్చేస్తున్నారు.. వస్తున్నారు దసరా సెలవులొచ్చేస్తున్నారు..!' పెద్దలూ బీరెడీ?!
***
''పెద్దలూ బీరెడీనా...?! ఇదేంటి.. పిల్లలూ.. బీరెడీ అనాలిగా?! '' అని ఇదేదో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ అనుకోవద్దు. నిజానికి సెలవులొస్తే.. రెడీ కావాల్సింది పిల్లలు కాదు. పెద్దలే. ఎందుకంటారా? అయితే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళాల్సిందే. వెనక్కంటే ఎక్కడికో కాదండోరు. జస్ట్‌ ఫ్లాష్‌బ్యాక్‌లోకి అన్నమాట. నిక్కర్లు వేసుకుని పలకాబలపం, వీలైతే రెండు నోటు పుస్తకాలు చంకలో పెట్టుకుని, బడికెళ్లిన రోజులన్నమాట. ఆ.. వెళ్ళారుగా.. అప్పుడు కూడా మనకు సెలవులొచ్చాయిగా.. వచ్చుంటారు.. వచ్చుంటారు. జస్ట్‌ ఫ్లాష్‌బ్యాక్‌ రింగుల్లోకి వెళదాం. వెళితే గిళితే గనక మనమూ బడికి సెలవులు ఎప్పుడొస్తాయా?! అని ఎదురుచూసిన వాళ్ళమే అయ్యుంటాం. ఆ ఎదురుచూపుల్లో అందమైన జ్ఞాపకాలెన్నో. నాటి బాల్యం గడిచిన తీరంలో ఏరుకున్న అపురూపమైన గులకరాళ్ళెన్నో.
***
జ్ఞాపకాలు.. ఒకటా, రెండా..?! చిన్నప్పటి మిఠాయి పొట్లం విప్పి చూస్తే అవి.. బోల్డన్ని. అప్పుడు తాతయ్య భుజాన వేలాడుతూ.. ఉయ్యాలలూగిన ఊసులున్నాయి. మామయ్య కట్టిన ఎడ్లబండిపై ఊరేగుతూ.. చెరువుగట్టు ఆసరాగా గరువు పొలమెళ్ళి, చెట్లెక్కిన సందర్భాలున్నారు. మధ్యాహ్నాం కాగానే జీడిమామిడి చెట్టు కింద అన్నం ముద్దలు చేసి, కొసరి కొసరి తినిపించిన వ్యవసాయకూలీల గారాబాలున్నాయి. అంతేనా?! అమ్మమ్మ చేసిన సున్నుండల తీపి, నాన్నమ్మ పంచిపెట్టిన కొబ్బరిలౌజు రంజు, మూడుపూటలా కడుపుబ్బరం చేసేంత నెయ్యి, పప్పన్నాలు. అబ్బో బ్రహ్మాండమైన తీపికబుర్లు. సాయంత్రం దుర్గమ్మ గుడి దగ్గర రోడ్డుకి అడ్డంగా తెల్లటి తెరకట్టి ఆడే ''బొబ్బలి పులి'', ''ఖైదీ'' సినిమాలు 'ఈరోజు రాత్రి..' అనే ఎనౌన్స్‌మెంట్లు. అప్పుడు దసరా పందిట్లో ఆడిందే ఆట పాడిందే పాట.
***
సెలవుల్లో ఊరెళితే..పెద్దమ్మ, పిన్నమ్మల ఆలింగనాలు, చిన్నత్త పెద్దత్తల బుగ్గ గిల్లుళ్ళు. బాబారు, పెదనాన్న పంచిపెట్టే చిల్లరడబ్బులు. ఎన్నెన్ని అనుభూతులు. ఎన్నెన్ని అనుబంధాలు. తలచుకుంటే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి చక్కలిగింతలే. ఆరుబయట ఆటల్లో పొరుగింటి సీతాలు, వెనకింటి శీనుతో జత కట్టడాలు.. ఊరు విడిచి వస్తున్నప్పుడు.. ఏదో పోగొట్టుకున్నంత ఫీలింగ్‌.. నాలుగురోజులు ఊరు పంచిన బంధాన్ని విడిచి రావాలంటే మనసంతా ఒకటే భారం. ఏడుపొక్కటే తక్కువ. అటు పెద్దలు.. ఇటు పిల్లల మధ్య ఆప్యాయతల దోబూచులాట. ''మళ్ళీ ఎప్పుడొస్తావురా బుజ్జీ..?'' అనే అప్పగింతల నడుమ చెమ్మగిల్లిన కళ్ళు. ఇవన్నీ నాడు పండుగ సెలవుల్లో దొరికిన ఆణిముత్యాలు.
***
మరి మన పిల్లలకీ ఇలాంటి అనుభవాలు వద్దా..!? ''ఎట్లా సాధ్యమయ్యేది.. కుదిరేది..? పట్నం చదువులు.. పట్నం సావాసాలూ.. కాలు కదపని ఉద్యోగాలు. ట్రాఫిక్‌ జామ్‌లు, ఫ్లైవోవర్లు దాటుకుంటూ కిక్కిరిసిన వ్యానుల్లో బడికెళ్ళే మన పిల్లలకీ ఏడాదిలో ఒక్కసారైనా పల్లె అనుబంధాన్ని పంచలేమా? పిజ్జా కార్నర్‌లు, ఐమాక్స్‌ థియేటర్ల సినిమా షోలు, థీమ్‌ పార్క్‌ సరదాలు, వీడియో గేమ్‌ సెంటర్లలో కాలక్షేపాలు.. ఇవే సెలవులకు ఆటవిడుపులు అవుతున్నాయి. 'గ్రాండ్‌ మా, గ్రాండ్‌ పా, అంకుల్‌..!' అని గుర్తు చేసుకోవడమే తప్ప.. నేషనల్‌ హైవే దాటి ఊరు తీసుకెళ్ళే సాహసం చేస్తున్నామా..?! లేదు లేదు.. సమ్‌థింగ్‌ మిస్సవుతున్నాం. ఒకప్పుడు మనకు పల్లె పంచిన బాల్యాన్ని మన పిల్లలకు దక్కకుండా చేస్తున్నాం?! పట్నంలోని ఇరుకైన గదుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, తాతయ్యలకు చోటులేని పరిస్థితిలో 'పెద్దరికం' మన మధ్య ఓ నల్లపూసే. ఏదో మిస్సవుతున్నాం. మన పెద్దల్నే కాదు, పుట్టి పెరిగిన బాల్యాన్నీ మిస్సవుతున్నాం. ఆ బాల్యపు సంగతుల్ని ముడివేసుకున్న ఊరునీ మర్చిపోతున్నాం. అందుకే.. దసరా సెలవులొస్తున్నారు.. పిల్లలతో ఊరెళ్ళి పెద్దవాళ్ళని పలకరించి, పండుగ చేద్దాం..! గుప్పెడు అనుభూతుల్ని మోసుకొద్దాం..!!
- గంగాధర్‌ వీర్ల 

Saturday 3 October 2015

థికింగ్ సో..!!
........
అరచేతిలో రెండు గులకరాళ్ళు
రెండింటివి పరస్పర వ్యతిరేక దృవాలే
అవికలలుగనే దృశ్యం వేరు
సాదృశ్యమూ వేరు
ఒకదానికి ..
నాటి బాల్యపు ముచ్చట్లు ఎక్కడున్నాయోనని వెదుకులాట
మరొకదానికి..
వర్తమానపు పీకులాటల్ని
వెదికి గురిచూసి కొట్టాలనే కసి
రెండింటి ఆలోచనలకీ
రెండింటి ఆత్రాలకీ అసలు పొంతనే లేదు
రెండు గులకరాళ్ళు దెబ్బలాడుకుంటున్నాయి
వాదులాడుకుంటున్నాయి
పొంతనలేని సంఘర్షణలో
అర్ధం లేని చప్పళ్ళు చేస్తూనే ఉన్నాయి
000
ఒకటి నిన్న
మరొకటి నేడు
రేపటి దారిలో మరొకటేమో!?
అరచేతిలో రెండు గులకరాళ్ళు
తీరం వెంబడి ప్రయాణించే భావోద్వేగాలు!!
03-10-2015



Friday 25 September 2015

అబ్జర్వేషన్

.....
సముద్రం లేని చోట
ఎగిసిపడే అలలకో్సం వెదికినట్టు
మల్లెలగుభాళింపు లేని చోట
పరిమళపు సంతకాన్ని ఆశించినట్టు
నీరులేని చోట
దాహార్తిని తీర్చుకున్నట్టు
జీవితపుసానుకూలం..
ఎక్కడో ఏదో ఉందని
ఎక్కడో..నడిచివెళ్ళేదారిలో..
పడిలేచే పరుగుపందెపు పందేరంలో
కాసిన్ని ఆశల్ని పండించుకోవడం
ఓ యుద్ధం!
ఈ యుద్ధంలో మరణాలుండవ్
మరణశయ్యలు మాత్రమే ఉంటాయ్!

-గంగాధర్ వీర్ల
25-09-15