Saturday 21 May 2016


పీచుమిఠాయండోయ్
పల్లవి:
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం -2

చరణం:
తారంగం తారంగం
పుల్లకు చుట్టే తారంగం
నోట్లో కరిగే తారంగం
గొంతులో జారే తారంగం
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం

చరణం:
నోటిలో కరిగెను తారంగం
పీచమణిగెను తారంగం
జీడికడ్డీ అయ్యెను తారంగం
కొరికితినేశాను తారంగం
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం

చరణం:
నోరంతా తీపయ్యే తారంగం
మూతి గులాబిరంగయ్యే తారంగం
చెడ్డీ, గౌనుకి జిడ్డయ్యే తారంగం
వేళ్ళన్నీ చప్పరించేసాలే తారంగం

తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం-2

-గంగాధర్ వీర్ల, 21-05-2016


   

Thursday 19 May 2016

వానా.. వానా
.............................
1
చల్లని స్పర్శమీటంగానే
మనసుకి రెక్కలొచ్చేశాయి
వీహాంగమై.. కరిమబ్బు మేఘమై
చినుకు.. చినుకూ వాలిన చోట
మొఖానవాలిన తడి చెమ్మనై
000

2
తాపమోడ్చిన నెరల్లో
ఆమాంతంగా వాలిన
నీ బిగికౌగిలి జలదరింపు
నానిన గుండెల్లో
పుడమి వాకిట ఏదో కవ్వింపు
000
3
తడిసిన శరీరాన్ని
అలాగే వదిలేయాలన్నంత ఆనందం
ఆకాశంవైపు చూస్తూ
ఇంకా ఇంకా తడిసి ముద్దయిపోవాలనే ఆరాటం
నేను భూమిని
కుంభవర్షంలా
రావోయ్.. నావళ్ళంతా చల్లగా చుట్టేసుకో
000
4
నిండువేసవి
చీల్చుకుని వానొచ్చే
వానతోపాటు వయ్యారమొచ్చే
చల్లని పలకరింతొచ్చే
పుడమి విచ్చుకున్న పలవరింత వచ్చే
వానా..వానా
నీతో నేను..
తుళ్ళింతల దివానా

-గంగాధర్ వీర్ల
ఈ వర్షం సాక్షిగా.. 19-06-2016

 

Tuesday 17 May 2016

డోంట్ బీ లైక్ దట్

ఎవరికోసం నిట్టూర్పు
దేహం రెండుగా చీల్చినట్టుందా!?
మేబీ.. ఉండొచ్చు
కాంక్ష వేరు.. ఆ కాంక్ష వేరు
రెండింటికీ మధ్య చాలా ఆగాధం ఉందేమో
000
నాలోకి అలా కఠినాత్మకంగా తొంగిచూస్తే
ఎర్రని రక్తకణాలతో నిండిన
దేహమే కనపడొచ్చు
ఇంకా వైవిధ్యంగా వెదుకు
కాసిన్ని ఆలోచనల్ని
సుతారంగా అదిమిపట్టి
నన్ను పట్టుకోడానికి
ప్రయత్నించు
ఏమో.. ఏదో ఒక రూపంలో దొరుకుతానేమో
000
ఇప్పటికీ దేహం..
రెండుగానే చీల్చినట్టుగానే ఉంది
ఒకటి అనుభవం
మరొకటి విధ్వేషం
మనిషి లోపలి పొరను పట్టుకోవడం
నీకెందుకు సాధ్యం కావడంలేదు
000
ఇప్పటికీ నా దేహం
రెండుగా చీలినట్టుగానే ఉంది
కాదు.. కాదు..
అనవసరపు వెదుకులాటలో
నా దేహాన్ని
ఎవరో కావాలనే చీల్చినట్టుగా ఉంది
హేయ్.. డోంట్ బీ లైక్ దట్!!
-గంగాధర్ వీర్ల, 17-05-20016