Saturday 8 July 2017

వాన- అమ్మ చీరకొంగు
..............
నిన్న సాయంత్రం
గుండెలపై కురిసిన వాన
ఇంకా తడితడిగానే తగులుతోంది
వస్తున్నానని చెప్పకుండానే
బంధువులా వచ్చిపోతున్న వానలో
ఎన్నెన్ని పార్శ్వాలు
చేతులు చాచి.. ఆ మాంతంగా హత్తుకుని
నిలువునా తడిచిపోయేలా చేసే వానలో
చాలా గమ్మత్తులే ఉన్నాయి
000
చూరు కింద నిలబడి చూస్తే
వాన పెట్టే కుంపటి అంతా ఇంతా కాదు
తడిసిన పొయ్యలో కట్టెలు మండవు..
కాయంకష్టం చేసే పొట్టలో ఆకలి తీరదు
చెప్పాపెట్టకుండా వచ్చేవాన..
పేదోడి ఇంటిలో ఆకలికి సంకేతం
000
అక్కడేమో!?
వాన.. ఖరీదైన కాఫీషాపుల ముంగిట
స్టయిలైజ్డ్ గా.. నాట్యమాడుతూ..
వేడివేడిగా పొగలు చిమ్మతూ.. వయ్యారాలు పోతుంది
ఇక్కడేమో!?
వానరేపిన చల్లని సెగతో
బాల్కనీలో కాలం తెలియని కబుర్లు
ఇంకోచోట
కుండపోత వర్షంతో పోటీపడుతూ
కాక్ టైల్.. మైమరపు మత్తులు
000
అదిగో అక్కడ .. వానొస్తే
అక్షర సమూహాలు .. వళ్ళంతా కళ్ళు చేసుకుని
చిటపట చినుకుల్లో
తమ స్వాప్నిక లోకంలో పూచే..
పూల గుభాళింపును వెదుక్కుంటూ..
వానరాకడ, పోకడలలో
చెట్టు చేమల పరవశాన్ని
మెలకెత్తే విత్తుల్లో మర్మాన్ని
గుండెల్లోకి హత్తుకుంటూ
సిరాచుక్కలుగా .. భావయుక్తమవుతున్నాయి.
000
మరోచోట
ఎట్టకేలకు..వానొస్తే..
బీడుభూమంతా ఆవురావురమంటూ
విచ్చుకున్న పచ్చని పరుపవుతుంది
కరిమబ్బుల్ని దాటుకుంటూ
భూమిపుత్రుడి ఇంట
సిరులుపొంగే ధాన్యపు గింజవుతుంది
00
ఇంకా ఇంకా అనేక చోట్ల
వాన.. ఆ వానలో దాగున్న జాడలెన్నో
కాసేపు కురిసినా
రాత్రంతా కుమ్మరించినా
వరదైనా
వాగైనా
వానలో.. అందనంత జీవితసారం
వాన.. ఓ సంతోషం
వాన ఓ భావోద్వేగం
అంతేకాదు,
వాన.. కన్నీటి తెరను కప్పి పుచ్చే
అమ్మచీరకొంగు
-గంగాధర్ వీర్ల