Thursday 29 December 2016


దేహంపై ..పచ్చబొట్టు
.....................
నా దేహాన్ని 
నాకు నేనుగా స్పర్శించుకుంటుంటే
కొత్తగా..తోస్తోంది
నన్ను నేను తెలుసుకోలేకపోయానని
ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది
లోలోన ఇన్నిన్నిరాగాలా?!
ఇన్నిన్ని స్వప్నాలా?!
ఇంతకాలం.. 
దేహం దేహంగానే ఉండిపోయిందేమో!
లోతుగా స్పర్శించుకోలేకపోయానేమో?!
నన్ను నేను చూసుకోలేకపోయానేమో?!
000
ఇప్పుడు..
నా దేహం.. ఒక అచంచలం
అనిర్వచనీయం
వెయ్యి వీణల తన్మయత్వం
000
ఇన్నాళ్ళూ..
ఈ దేహాన్ని.. ఒంటరి పక్షిగా..
ఏ స్నప్నం.. చొరబడని ఒడిలో
వదిలేశానా!?
పర్వాలేదులే..
ఆలస్యంగానైనా..
నా దేహంలోకి జారిపోతున్నా
000
ఇప్పుడు
నా దేహం.. నన్ను నన్నుగా 
పోల్చుకుంటుంది
నన్ను నన్నుగా లాలిస్తుంది
నన్నెరిగిన తన్మయత్వమై
నాతో మాత్రమే రమించే 
ఓ అంతరంగం.
000
ఇప్పుడు నాదేహం 
పగలు..రాత్రి 
నను ఊయలలూపే
కమ్మని పాట
తరగని..చెరగని పచ్చబొట్టు
-గంగాధర్ వీర్ల

Sunday 25 December 2016

నడిచేదారిలో.. విత్తనపూలు
.....................................
ఎటోకటు..
నాలుగు అడుగులు
వేయడం అనివార్యమైనప్పుడు
అలా వెళ్లేదారిలో..
నాలుగు విత్తన పూలను 

జల్లుకుంటూ పోదాం!
మన వెంటో, వెనకో నడిచొచ్చే అడుగులకవి
మెత్తని పూలదారికావొచ్చు.
రేపటిరోజున అవి..
మొలకెత్తి పదిమందికి
నీడనిచ్చే పచ్చని చెట్టవ్వొచ్చు!!
-గంగాధర్ వీర్ల
//సన్నీగాడింట్లోనో
డేనియల్ గాడింట్లోనో //
...................................


ఒకటో తరగతి నుంచి
పదో క్లాస్ దాకా.. 
డేనియల్, సన్నీ, మేరీ..
మేమంతా జిగురు దోస్తులం
కలిసి ఆటలాడేటోళ్ళం
పాటలాడేటోళ్ళం..
కాకెంగిలీ పంచుకునేటోళ్ళం
000
క్రిస్మస్ సెలవులొస్తే
పొద్దుటేలే
నీళ్ళోసుకుని..
మొఖానికి
పౌడరు పూసేసుకుని
నిక్కర్లోకి చొక్కా లో దోపేసుకుని
సూపర్ స్టయిల్లో
సన్నీగాడింట్లోనో
డేనియల్ గాడింట్లోనో వాలిపోయేవోళ్ళం
000
మాదేవుడు వేరు..
మేం చర్చికెళ్ళం..
అందుకే.. ఆపూట..
మా ఇంట్లో ప్రత్యేక వంటకాలు,
కేకులు ఉండేవి కావు
సంక్రాంతి పండక్కోసం
ముందుగానే సిద్ధం చేసే
అరిసెలు, జంతికలు తప్ప.
000
నోరూరించే కేకులు,
అరచేయంత సైజులో ఉండే చాక్లెట్లు
బిర్యానీ ఘుమఘమల గురించి
నేను..మొదటసారి తెలుసుకున్నది
డేనియల్ ఇంట్లోనే
000
రాములోరి గుడికాడ
భజనలు, భక్తిపాటల బృందాల్లోకి
పిలవకుండానే చొరబడిపోయి
ఆళ్ళతో..గొంతుకలపినట్టే
చర్చిలోనూ..
డేనియల్, సన్నీ, మేరీలతో
‘‘నడిపించు నా నావా..’’ అంటూ
పోటీపడ్డం ఇప్పటికీ నాకు బాగా గుర్తే
000
అప్పడు మతాల గురించి తెలీదు.
కులాల్లోని మర్మమూ తెలీదు.
ఆడు నల్లోడు.. ఈడు తెల్లోడు
అని ఒకళ్ళనొకలం ఏడిపించుకోవడం తప్ప.
మాకు తెలిసిందల్లా.. ఒక్క స్నేహమే.
కల్మషం ఎరుగుని
బాల్యపు సంస్కారమే
000
నాడు..నేలకందొచ్చిన తారలు
జింగిల్ బెల్.. జింగిల్ బెల్
అంటూ.. ఊరంతా
ఊరేగిన క్రిస్మస్ తాతలు
ఒకటేమని.. గుర్తుకొస్తున్నాయ్!
ఛలో.. ఛలో
జింగిల్ బెల్.. జింగిల్ బెల్
ఉయ్ ..ఫీల్.. ఆల్ ది వే!!
-గంగాధర్ వీర్ల

Friday 2 December 2016


అమ్మ బోడిచెవులు
.........................
మా అమ్మ..ఏరోజైనా పిసరంత
బంగారం మొఖం చూస్తే కదా?!
పెళ్లయినా, పేరంటమైనా..
నకిలీనగలతోనో.
000
అప్పుడెప్పుడో పెళ్ళప్పుడు..
అమ్మమ్మపెట్టిన కూసింత బంగారాన్నీ
నాన్నకు పనుల్లేక..
మమ్మల్ని పస్తులు ఉంచలేక
కిరాణాకొట్టాయనకు అమ్మేశాడంట.
ఆరోజున అమ్మకు...మళ్ళీ కొంటానని 
నాన్నమాటకూడా ఇచ్చాడంట.
కానీ రెక్కాడలేక కొనలేకపోయాడంట.
000
పాపం.. బోడి చెవులు, మెడతోనే
అమ్మ ఇంట్లోనే ముడుచుకుపోయేది
ఇరుగుపొరుగు పేరంటాళ్ళు, పెళ్లిళ్లు
శుభకార్యాలు.. వ్రతాలు..
ముత్తైదువుల పిలుపులంటేనే
అమ్మ గజగజ వణకిపోయేది
000
ఇళ్ళకు బంధువులు, చుట్టాలొస్తే
పరువు నిలుపుకోడానికో, ఊరెళ్ళడానికో
ఎప్పుడైనా.. నకిలీనగ పెట్టుకుంటే చాలు..
అమ్మచెవులు పాచిపోయేవి
పాపం.. అమ్మ నొప్పితో ఎంత గిలగిల్లాడిపోయేదో
000
అప్పుడు పిల్లలం.. మాకేం తెలుసు
అమ్మని చూసి బోడిచెవులని వెక్కిరిస్తూ
తెగమురిపిపోయేవాళ్ళం.
వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవిలా..
దుద్దులు, రింగులు తగిలించుకోవచ్చుకదా
అని లాజిక్ పాయింట్లు మాట్లాడేవాళ్ళం        
ముక్కుపై బుల్లిముక్కపుడక తప్ప
అమ్మ దగ్గర పసిడంత సింగారం ఏముందనప్పుడు?
000
అప్పుడు..
నాన్న రెక్కల కష్టాన్నిమోస్తూ..
అమ్మ బోసిపోయింది.
ఇప్పడూ అంతే. 
అప్పుడేమో అమ్మ
ఇప్పడేమో.. భార్య అంతే తేడా
అవే.. బోడిచెవులు
-గంగాధర్ వీర్ల
(అంతా.. బంగారం గురించి మాట్లాడుకుంటుంటే.. నవ్వాపుకోలేక)