Monday 28 November 2016

అమ్మ చేతిలో పిల్లనగ్రోవి
..................................................
మా ఇంటి చూరు కింద కుంపటి..
పస్తుల పూటల్ని దాటుకుంటూ ..

ఇయ్యాల.. కాస్తంత రాజుకొంటుంది
ఒళ్ళంతా పేదరికాన్ని కప్పుకున్న
కట్టెలు కూడా కనికరంగా..
పెళపెళమంటున్నాయి.
000
కుంపటిపై కుండ కాగితే..
నాలుగు ముద్దలు ఉడుకుతాయి
ఆత్రంగా.. ఎదురుచూసే
ఆ బక్కచిక్కిన కడుపున..
ఆకలితీర్చే జావవుతాయి
అందుకేనేమో..పేగుల్ని బిగబెట్టుకని
అమ్మ కడుపులో పొగగొట్టం
ఆత్రంగా ఊదుతోంది
పొగబారిన కళ్ళకు
బిడ్డ ఆకలి స్పష్టంగా కనపడుతూనే ఉంది
ఇప్పడు పొగగొట్టం..
అమ్మచేతిలో ఆకలి తీర్చే పిల్లనగ్రోవి
ఆ..డొక్కల్లో గాలి ఎగదన్నుతోంది
కుండపై జావ పొంగుతోంది!!
-గంగాధర్ వీర్ల







Wednesday 23 November 2016



బాలమురళీ.. 
నీకసలు సంగీతం వచ్చా?!
................................
ఎవరండి బాబూ.. బామురళికి సంగీతం వచ్చని చెప్పింది. అసలు.. ఆయనకసలు సంగీతంలో సాపాసాలే తెలీవట. అసలు వచ్చుంటే.. అందరిలా పాడేవాడుకదా.. మొఖానికి మేకప్పు, ఒంటికి హైటెక్‌ ఫ్యాషన్లు పులుముకొని .. ఎక్కడపడితే అక్కడ తగుదనమ్మా.. అని గంతులేసి మరీ ఆడేవాడు కదా?! అమ్మతోడు ఆయనకు నిజంగానే సంగీతం రాదట.

వస్తేగిస్తే.. అదే చేశేవాడు. ఇంకా వస్తే గిస్తే.. సినీ గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలేసి వదిలేసి.. త్యాగరాజు వారి సంగీత శిష్య పరంపరను ఎందుకు కొనసాగిస్తాడు. కర్నాటక సంగీత ప్రాశస్త్యాన్ని భుజాన ఏసుకుని .. ఎందుకు ఊరేగుతాడు. అసలు ఆయనకు సంప్రదాయ సంగీతమే తెలియదుకాక.. తెలియదు సుమీ! ఆమాటకొస్తే.. ఆయనకు సాపాసాలు కూడా రావు. వస్తేమరి.. ‘‘పలుకే బంగారమాయెనా’’ అని నలుగురితో నారాయణలా సాగిపోకుండా మహతి వంటి కొత్తరాగాలు  కనిపెట్టేసి.. తనకు తోచినట్టుగా కీర్తనలు, తిల్లానాలు, జావళిలు సృష్టించేసి అనాటి వాగ్గేయకారుల్నే మరిపిస్తాడా? తప్పుకదూ.

ఈకాలంలో.. కూసింత స్వరాలు, రెండు మూడు రాగాలు నోటికొస్తే.. మొఖానికి రంగు పులుమేసుకుని .. తెలుగు పాటకు వేలం వెర్రి డాన్సులద్దుతూ.. ‘‘ఇదే అసలు సిసలైన సంగీతమర్రా..బాబూ..’’ అంటూ చాలామంది శ్రీమాన్‌ ఆధునిక గాయకులు, గాయనీమణుల్లా..ఎలాగోలా బతికేస్తున్న ఈరోజుల్లో.. నాకేం తెలియదు.. నేనింకా ఎంతో నేర్చుకోవాల్సిన బాలుడ్నే అని పరిపరి విధముగా ఎందుకంటాడీయన. అలా అనడంలోనే నీ సంగీతపు గుట్టు తెలిసింది లేవయ్యా!!
బామురళీకృష్ణుడు తెలుగోడు. అయితే ఏంటంటా? పద్మ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌.. ఇలా భారతదేశపు అత్యున్నత పురస్కారాన్నీ వరసపెట్టి ఆయన మెడలో వాలిపోయాయి కదా?! అయితే ఏంటంట. ఆయన సంగీతపు గోల ఆయనది. ఆగోలపడలేక.. ఇచ్చారేమో!?

కర్నాటక సంగీతంలో గానగంధర్వుడా.. ఎవరు చెప్పారండీ బాబూ.. దక్షిణాది సంగీత స్థాయేంటో ఉత్తరాధి జనాలకు, అక్కడి ఉద్ధండ సంగీత పండితులకు 72 మేళకర్త రాగాల శోభితంగా.. సార్వ(సర్వ)జనీయంగా, ఘనంగా, హృద్యంగా.. బలంగా నొక్కివక్కానిస్తూ.. శృతిపక్వంగా చెప్పకనే చెప్పాడా?! తెలుగు వారింట మాత్రమేకాదు, యావత్తు సంగీత ప్రపంచాన మనకో బామురళీ ఉన్నాడని చెప్పుకునేలా, తలెత్తుకునేలా.. ఆళ్ళూ.. ఈళ్ళూ.. మనోళ్ళు.. పరాయోళ్ళు.. దేశీయు, విదేశీయులందరితో  ‘‘ఎందరో మహానుబావులు’’ అని పాడిరచినంత మాత్రానా.. గొప్పోడై పోతాడా?! భలేవారే.. ఆయనకు సంగీతంలో సాపాసాలు తెలిస్తేగా.. ఆ మాటన్నది ఆయనే.
‘‘సంగీతమంటే..మేళకర్త రాగాల్ని ఒడిసిపట్టి. బట్టీబట్టి కాసేపు కచేరీల్లో ఆటు ఇటు సాగదీస్తే చాలదోయ్‌.. ఇంకా చాలానే ఉన్నాయబ్బాయ్‌..’’ అని చెప్పినంత మాత్రానా.. బాలమురళి గొప్పవాడైపోతాడా?!. ఆయన.. రాగ, నాద, తాళాల్లో ఆరితేరిన పరిపూర్ణమైన గానగంధర్వుడట. ఏంటో పిచ్చి జనాలు.. ముందూ వెనకా.. ఆలోచించకుండా..పిచ్చిగా ఆరాధించేయడమే.

ఏం.. అందరిలా.. మూతివంకర్లు తిప్పుకుంటూ .. అవరోహణ, ఆరోహణలో.. పామరుడికి అర్ధంకాని భాషలో, యాసలో, బాణీల్లో నాలుగు రాగాలు తీసుకోవచ్చుకదా.. అలా చేసుంటే ఆయన సొమ్మేం పోయేది. నిర్మలంగా, మనోధర్మంగా పాడేయడమేకాకుండా.. గాంభీర్యమైన స్వరవిన్యాసంతో కోట్లాది జనాల్ని కట్టిపడేస్తాడా.? ఇది చాలా అన్యాయం కదూ. అందుకే అయన అందరిలా పెద్దగా సంగీతం తెలిసినోడు కాదు. ఈ విషయం మనం కొత్తగా చెప్పుకోవాలా ఏంటీ? స్వయంగా ఆయనే చాలాసార్లు చెప్పాడుగా. సంగీతంలో ఆయనెప్పుడూ నిత్యవిద్యార్ధేనట. అంతేమరి.. అసలు ఆయనపేరే బామురళీకృష్ణుడు కదా.

సంగీతానికి పట్టువిడుపు ఉండాలి. కానీ ఇదేంటి. ఈయనకు అన్నీ పట్టింపులే. ఎప్పుడో త్యాగరాజుస్వాములవారు చెప్పినట్టు.. కళను నమ్ముకోవాలిగానీ..అమ్ముకోగూడదు? అంటాడు. ఇదేమి లాజిక్‌. మిగితావాళ్ళల్లా నాలుగు విదేశీ కాంట్రాక్ట్‌లు తెచ్చుకొని, రెండు మూడు రికార్డింగ్‌ ధియేటర్లు, నాలుగు ఆడియో కంపెనీలు కట్టుకుని ఎంచక్కా..కాళ్ళమీద కాలేసుకుని.. బతికేయొచ్చుగా.. అంతా పాతచింతకాయ పచ్చడి టైపు మనిషి. శుభ్రంగా.. చాలా సాదాసీదాగా పట్టులుంగీ కట్టుకుని.. చాపమీద కూర్చుని.. నాలుగు కొత్తరాగాలు కనిపెడితే..  చాలనుకుంటాడు. అలా కనిపెట్టిన రాగాల్ని పొట్టలో దాచుకోడు.. అప్పటికప్పుడు శిష్యులకి వినిపిస్తేగానీ కంటినిండా నిద్రపోడు.

రాగం విషయంలో ఎంతపట్టింపో.. మాటపట్టింపులూ ఆయనకు ఎక్కువే. ఎన్టీఆర్‌లాంటి పెద్దోళ్ళతోనూ తగువు పెట్టుకుని.. ఆంధ్రాలో అడుగుపెట్టను. అని శపదం చేసి, కళాకారుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించినోడు. సంగీతం తెల్సినోళ్ళు ఇలా చేస్తారా?! సర్దుకుపోరూ!

ఎవరైనా నాలుగు నేర్పండి సార్‌.. అని అడిగితే ఇంట్లోపెట్టుకుని .. నాలుగొంద రాగాలు నేర్పేస్తాడు.. పాపం బోళాశంకరుడు,.. ఈ విషయం ఎవరో చెప్పాలా.. ఆయన శిష్యుల్లో ఒకరైన డివీ మోహనకృష్ణే అందుకు.. ఓ ఉదాహరణ. ఏంటో ఈయనకు.. బొత్తిగా సంగీతమే తెలియదు. తెలిసినవి దాచుకోడు. ఏమైనా అంటే ‘‘ఏమీ.. సేతురా లింగా..’’ అని నవ్వి ఊరుకుంటాడు.

సంగీతం తెలిసుండటం అంటే.. గాత్రం.. రాగాల్లోని శాస్త్రాలు ఒక్కటేకాదు.. నాదాలూ తెలిసుండాలి. నేర్చుకుని ఉండాలి. సంగీత సంబంధమైన అన్ని విషయాల్లోనూ ప్రవేశముండాలి.. అని నమ్మి.. సైలెంట్‌గా ఊరుకోవచ్చుకదా.. వీణవాయిస్తాడు. మృదంగంపై తాండవిస్తాడు. వయోలిన్‌పై లీనమవుతాడు.. టకటకమని కంజిర మోగిస్తాడు.. ఏం మిగితా సంగీతజ్ఞుల్లా.. నాలుగురాగాలు తీసుకుని ఉండొచ్చుకదా. ఏమైనా అంటే.. సంగీతమంటేనే తాళ, నాద, రాగ సమ్మేళనం అంటారాయే. ఏంటో.. ఓపట్టాన అర్థంకారు.
నిజంగానే బాలమురళికి.. సంగీతం రాదు.. వచ్చుంటే.. అందరిలా.. నాలుగు సంప్రదాయ కీర్తనల్ని పాడుకుని మిగిలిపోయేవాడు. కానీ రాదుకాబట్టే నిత్య విధ్యార్ధిగా నేర్చుకుంటూ .. భారతీయ సంగీత కీర్తిని అంతెత్తున నిలబెట్టి.. తనో తనివితీరని సంకీర్తనగా మిగిలాడు. ఎనబై ఆరేళ్ళ జీవితంలో దాదాపు ఎనబై ఏళ్ళు తన గానామృతాన్ని పంచిపెట్టిన బాలమురళీ .. నిజంగానే బాలుడై నిత్యం మనందరిలో మారుమోగుతూనే ఉంటాడు.
-గంగాధర్‌ వీర్ల




Sunday 13 November 2016

ఆ బుగ్గలు.. 
మన బాల్యానికి తీపి గురుతులు!!
.....................................
పిల్లలు.. పిల్లల్లాగానే ఉండాలి.
పిల్లల్లాగా అంటే.. అల్లరి చేయాలి.
ఆడుకోవాలి. పాడుకోవాలి. పరుగెత్తాలి.
ఆనందంతో గంతులు వేయాలి.
విజ్ఞానపు వీధుల్లో చురకత్తులవలే విహరించాలి.
ఇవన్నీ కలిస్తేనే 'పిల్లలు' అవుతారు.
000
ఎవ్వరికైనా.. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం.
ఆ బాల్యం అందంగా.. అర్ధవంతంగా సాగాలంటే..
పెద్దలు పిల్లల్లా మారాలి. పిల్లల్లో కలిసిపోవాలి.
ప్రేమగా పిల్లల మనస్తత్వాలను చదవాలి.
000
పిల్లలంటే..
కేవలం ఆటబొమ్మలతో ఆడుకునే బుజ్జాయిలేకాదు..
ఆంక్షలు లేని బాల్యాన్ని కాంక్షించే
'పెద్దమనసు'గల పిల్లలు కూడా.
000
ప్రపంచీకరణకు ముందు గడిపిన బాల్యం వేరు..
ఇప్పటి పిల్లల బాల్యం వేరు.
వారి బాల్యపు ప్రయాణాలూ వేరు.
మట్టిబలపం పోయి.. ప్లాస్టిక్‌ బలపాలొచ్చాయి.
అవికూడా పోయి ట్యాబ్‌లు. కిండిల్‌ పలకలొచ్చేశాయి.
అక్షరాలు దిద్దేరోజునే..
త్రిపుల్‌ ఐటీ.. సిలబస్‌నూ మోయాల్సిన పరిస్థితులు.
కానీ ఇవన్నీ బాలల హక్కుల్ని హరిస్తున్నవే.
అందుకే.. కాసేపు 'పెద్ద మనసు' చేసుకుని..
బాలల ప్రపంచంలో విహరిద్దాం!
కాసేపైనా.. వారికి నచ్చినట్టుగా  ఉంటామని
మన పిల్లలకు మాటిద్దాం!!
-గంగాధర్ వీర్ల, 14 నవంబర్-2016

Tuesday 1 November 2016

నాన్నొచ్చాడు.. దీపాలు తెచ్చాడు
..............
అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడే? అంటే..
దీపావళి పండక్కి వస్తాడ్రా పెద్దోడా.. అంది
దీపావళి ఎప్పుడొమ్మా? అంటే
ఎల్లుండేరా అని ఊరించింది
నాకేమో.. దీపావళి అంటే బోల్డంత ఇష్టం
చిచ్చుబుడ్డులు
భూచక్రాలు
విష్ణుచక్రాలు
తాటాకు టపాసులు
పాము బిళ్ళలు
అగ్గిపెట్టెలు
మతాబులు
కాకరపువ్వొత్తులు
ఉల్లిపాయలు.. అంటే నేలటపాసులు
ఎప్పుడు కొనుక్కోవాలే అమ్మా.. అంటే
నాన్న రేపొత్తాడుగా.. అంది
..
రేపే దీపావళి
ఇంకా నాన్న డ్యూటీ దిగలే
నాన్న లారీ డ్రైవర్
నేషనల్ పరిమిట్ ఉన్న పెద్ద డ్రైవర్
డ్యూటీకెళ్ళాడో..
పదిహేను, ఇరవై రోజులికిగానీ ఇంటికి చేరడు
నాన్న ఇంకా డ్యూటీ దిగలేదు
రేపే దీపావళి..
టపాసులు కొనుక్కోవాలి
అమ్మదగ్గర డబ్బుల్లేవు
నాన్న వస్తేనే పండగ
000
అమ్మా.. ఇయ్యాలే పండగ కదా
నాన్న ఇంకా రాలేదు అంటే..
వత్తాడ్రా పెద్దోడా.. అంది
..
ఇరుగు పొరుగు
దీపాలు వెలిగించేశారు
పక్కింటి శీనుగాడు
టపాసలు కాలుత్తున్నాడు
మా ఇంట్లో్ దీపాలు ఇంకా ఎలగలేదు
000
అదిగో అప్పుడే
మాసిన గెడ్డంతో
మురికిపట్టిన బట్టలతో
నాన్న వచ్చేశాడు
వస్తూ వస్తూనే
రేయ్ పెద్దోడా.. పద..
పటాసులు కొనుక్కుందాం అన్నాడు
అమ్మకళ్లల్లో ఇప్పడు దీపాలు ఎలిగినాయ్
నేను, నాన్నబజార్ కి పోయాం
ఏబై రూపాయలకి
సంచుడు టపాసలు
మోసుకొచ్చాం
హమ్మయ్య
మా ఇంట్లోనూ దీపాలు వెలిగాయ్
టపాసలు పేలాయ్!!
-గంగాధర్ వీర్ల
(నాన్న అందించిన చిరుదివ్వెల జ్ఞాపకాలతో..)