Friday 20 May 2011

గాయం


గాయం

చీకటికి నేనంటే అస్సలు జాలేలేదు
రాయిలా ఎదురొచ్చి
గాయం చేసింది
....



తల్లిప్రేమ


ఎండలో నీడకమ్ముకుంది
అమ్మకొంగు
నాపై పరచుకుంది
.....



పెదాలూ 

చిగురుటాకులు
వణుకుతున్నాయ్   
నీవులేవంటే
నా పెదాలూ
వణుకుతున్నాయ్

Thursday 12 May 2011

వెర్రిదద్దమ్మలు

అక్షరాలు
ఒకటికొకటిగా ఘర్షణపడుతున్నాయి
ఏదో ఒక్క విషయంలోనైనా
ఏకీభవించొచ్చుగా
ఒకటి తూర్పు
మరొకటి పడమర వైపు
వాస్తవం..
నాకు తెలుసంటే నాకు తెలుసు
పాపం
పాపం రెండు దృవాల మధ్య
నిజం పిచ్చిదైపోతుంది
..
అదిగో
మనం ఎంతో ఇష్టంపడి
ఒక్కటిగా పేర్చుకున్న
రెండక్షరాలు
చీలు పోతున్నాయి
పాపం
నిజాన్ని నిర్భయంగా చెప్పే
సాహసం నాకు లేదు
నా అక్షరాలు..
వెన్నెల్లో ఆడుకునే
ఆడపిల్లలు కాదు
ఇది నిజమని చెప్పలేని వెర్రిదద్దమ్మలు

Wednesday 11 May 2011

నీ నవ్వులో


నీ నవ్వులో
ఏముందో ఏమోగానీ
...
కూసింత నావైపు చూసి
కాసింత నవ్వేవో లేదో
హనుమంతుడినై పోతున్నాను
...
సముద్రాన్ని రెండుగా
చీల్చుకుంటూ
నీ దగ్గరకొచ్చేంత
శక్తి ఆవరిస్తుంది
...
ప్రేమకు పరాకాష్ట
త్యాగం కాదేమో
ధైర్యమే కదూ..?

Sunday 8 May 2011

వర్షపు చినుకులు


నింగిలోంచి
జారిపడుతున్న చుక్కలు
చేతిలోకొచ్చి చల్లగా మెరుస్తున్నాయి
అది చూసి
నీలి మేఘం నాపై అలిగింది
కోపంతో
మండుటెండలోకూడా
కుండపోతయ్యింది
ఏమయితేనే
మా మధ్య
చిలిచిలికి
వర్షపు చినుకులు
నేలపై వాలాయి
 

Monday 2 May 2011

రెండు రెళ్ళు ఆరు

నిజంగానే
రెండు రెళ్ళు ఆరు
రెండు రూపాయలు సంపాదించగలిగితే
మరో నాలుగు రూపాయల


బారం నెత్తిమీద పెరుగుతూనే ఉంది
నేను సగటు మధ్య తరగతి జీవిని
నేను చదువుకున్న గుణింతాల్లో
రెండు రెళ్ళు నాలుగనే ఉంది
...
కానీ
మా పిల్లాడు చదివే
గుణింతాల పుస్తకాల్లో
రెండు రెళ్ళు ఆరు.. అని
మార్చాలి
మార్చితేగానీ
నా కొడుక్కి
నా కష్టమేంటో అర్ధంకాదు
...
పాపం వాడూ..
వాడి
.. కొడుకొస్తే
రెండు రెళ్ళు ఆరు...
కాదు కాదు
రెండురెళ్ళు పదహారు అని నేర్పుతాడేమో..?




Sunday 1 May 2011

నా బొమ్మలు

నీలికన్నులే కాదు
నీలి వర్ణంలోనూ
అందానికి అందం
...
సంప్రదాయపు
జానపద చిత్తరువు
..
నీలాల తనువు
నింగికే వెలుగు