Sunday 3 April 2011

Ugaadi.. shubhakaram

.....
మిత్రుడు శింగరాజు మాధవ్ సాక్షిలో రాసిన ugaadi
ఆర్టికల్.. నాకు బాగా నచ్చింది.. మీరు చదవండి..
maadavji
అద్భుతమైన రాతగాడు
మంచివాడు..
మనసున్నవాడు
ఇక చదవండి

నేను శుభ ఖరం
నా దగ్గర కొత్త పూల వేప గుత్తులు ఉన్నాయి. కుంకుడుస్నానం చేసిన కురులపై అక్షింతలయ్యేందుకు అవి చేరాలుతున్నాయి. నా దగ్గర తొలికాపు మామిడి పిందెలు ఉన్నాయి. మీ ఇంటి చిన్నారి మహలక్ష్మి కాలి అందియలకున్న వెండి పిందెలను చూసి చెలిమికి బిడియపడుతున్నాయి.

తెరలను తొలగించి, వెలుగును ప్రసరించే మొదటి ఆకాంక్ష నాదే కావాలి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం / న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాః
అందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. చేతనైన సహాయం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ప్రకృతిని పూజించాలి. జోలెపట్టి ఫలాల ప్రసాదం స్వీకరించాలి. కనురెప్పలకు అద్దుకోవాలి. కృతజ్ఞత తెలుపుకోవాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి. ప్రజాభీష్టాన్ని మన్నించాలి. - ఇది నా ఆకాంక్ష.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః

ఎండలు ఎంత కాయాలో అంతే కాయాలి. వర్షాలు ఎన్ని పడాలో అన్నీ పడాలి. భూమి నిండా పాడీపంట, తల్లుల ఒడినిండా పిల్లాపాప కళకళలాడాలి. రుతువులు గతిలో ఉండాలి. బతుకులు శ్రుతిలో ఉండాలి.
సర్వేశ్వరుడికి ఇది నా నివేదన.

* * *
తెలుగిళ్ల సుప్రభాతాలకు చన్నీళ్ల చిలకరింపులు మొదట నావే కావాలి.
ఆరుబయటి వగరు గాలినై వాకిళ్లను మొదట నేనే నిద్రలేపాలి. ముంగిళ్లలో రాలుపూత ముగ్గులన్నీ నేనే వెయ్యాలి.. మనసుకు సోకే మొదటి గానం నాదే అవ్వాలి. గడప గడపకు తొలి తోరణం నేనే కట్టాలి.
ఐయామ్ ఉగాది. డాటరాఫ్ బ్రహ్మ. రెసిడెంట్ ఆఫ్... మీరుంటున్న కాలనీ. విష్యూ ఆల్ ఎ హ్యాపీ సంవత్సరాది!
‘‘ఖర్మ! శ్రీఖరా... నువ్వేమిటి? ఆ భాషేమిటి? మన సంస్కృతేమిటి? మాటల సంకరమేమిటి? ఒంటిపై లంగాఓణీ ఏమిటి? నోట్లోంచి ఆ జీన్ ప్యాంటు, టీషర్ట్‌ల పద సంప్రదాయం ఏమిటి? బ్రహ్మకు కూతురేమిటి? నారదుడొక్కడే అతడి కొడుకు కాదేమిటీ?’’
అయ్యో! మాట మారిందా?! పోనివ్వండి, నా మనసేం మారలేదు కదా! ఆకాంక్షలూ మారలేదు. నారదుడిలా నాలుగు దేశాలు తిరగబట్టి నాలుక ఏవో పొసగని చివుర్లను కరిచినట్లుంది. భాషలేవైనా భావం ఒక్కటేనని కాస్త ఉత్సాహపడినట్లున్నాను. బ్రహ్మకు మాత్రం? పేరుకే నారదుడు కానీ, పిల్లలు కానివారెవరు? భూమి మీద ఆయన జ్యేష్ట పుత్రిక నేనుగాక మరెవరు?

* * *
సృష్టి - స్థితి - లయ; బ్రహ్మ - విష్ణు - మహేశ్వర.
పుట్టించేది బ్రహ్మ. పోషించేది విష్ణువు. మోసుకెళ్లేది శివుడు.
బ్రహ్మకు ముహూర్తబలం నేను. బ్రహ్మకు ముద్దుల కూతురు కూడా నేనే. ద్వాపర యుగాంతంలో, కలియుగారంభంలో ఓ మంచి రోజు సృష్టి మొదలైంది. ‘మంచి రోజు’ అంటే మొదటి రోజు. సృష్టి నిర్మాణం కోసం కాలంలోని ప్రతి సంక్రమణంలోనూ మొదటి ఘడియనే ఎంచుకున్నాడు పితృదేవుడు.
అరవై సంవత్సరాదులలో మొదటిది - ప్రభవ.
ప్రభవలోని ఉత్తర, దక్షిణ ఆయనాలలో మొదటిది - ఉత్తరాయణం.
ఉత్తరాయణంలోని వసంత, గ్రీష్మ రుతువులలో మొదటిది - వసంత రుతువు.
వసంతంలోని చైత్ర, వైశాఖ మాసాలలో మొదటిది - చైత్రమాసం.
చైత్రంలోని శుద్ధ, బహుళ పక్షాలలో మొదటిది - శుద్ధపక్షం.
శుద్ధపక్షంలోని పదిహేను తిథులలో మొదటిది - పాడ్యమి.
పాడ్యమిలోని ముప్పై ముహూర్తాలలో మొదటిది - బ్రాహ్మీ.
బ్రాహ్మీముహూర్తంలోని సృష్టి, స్థితి, లయల్లో మొదటిది - సృష్టి.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో మొదటివాడు బ్రహ్మ. అంతటి బ్రహ్మ, సృష్టి మొదలు పెట్టిన రోజే... యుగాది. ఆ యుగాదినే నేను. కలియుగానికి ఆదిని నేను. కృతయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు మొదలైంది. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి నాడు మొదలైంది. ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశినాడు మొదలైంది. నా యుగం చైత్ర శుద్ధ పాడ్యమినాడు మొదలైంది.

ఇవాళ ఇదే చైత్ర పాడ్యమిలో... బ్రాహ్మీ ముహూర్తంలో- మీకోసం మీ ఇంటి బయట షడ్రుచులతో వేచి ఉన్నాను. గండు కోయిల నా వెంట ఉంది. దాని గొంతు నిండా లేలేత మేతల గీతికలున్నాయి. చెంతనే రామచిలకా వచ్చి వాలింది. తీపి పలుకులేవో నేర్చి దాని నోరు పండినట్లుంది!
నా దగ్గర కొత్త పూల వేప గుత్తులు ఉన్నాయి. కుంకుడుస్నానం చేసిన కురులపై అక్షింతలయ్యేందుకు అవి చేరాలుతున్నాయి. నా దగ్గర తొలికాపు మామిడి పిందెలు ఉన్నాయి. మీ ఇంటి చిన్నారి మహలక్ష్మి కాలి అందియలకున్న వెండి పిందెలను చూసి చెలిమికి బిడియపడుతున్నాయి.
నా దగ్గర ఉన్నవన్నీ కొత్తవే. చింతపండు కొత్తది. నలిగిన మిరియాలు కొత్తవి. నరికిన చెరకులు కొత్తవి. పరమాత్మకు నైవేద్యంగా పెట్టండి. పెద్దవాళ్ల చేతుల నుంచి తిరిగి అందుకోండి.

* * *
కొత్తది అంటే మొదటిది. మధురమైనది. మరువలేనిది.
తొలి ప్రేమ తియ్యనిది. తొలిముద్దు తడి ఆరిపోనిది. తొలి బిడ్డ... అపురూపమది! తొలియవ్వనం తొణికిసలది. తొలి స్నేహం విడిపోనిది. తొలి కానుక, తొలి వేడుక కలకాలం ఉండిపోయేవి.
జీవితమెప్పుడూ... అప్పుడే పుట్టినంత కొత్తగా అనిపించాలి. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడే కొత్తగా నోరు తెరుచుకుని చూస్తుండాలి. కొత్త నేల, కొత్త నింగి, కొత్త నీరు, కొత్త నిప్పు, కొత్త గాలి... జీవితపు పంచేంద్రియాలను కొత్తగా మొలకెత్తించి, కొత్తగా తలెత్తించి, కొత్తగా అభిషేకించి, కొత్తగా కణకణమనిపించి, కొత్త ఊపిరి ఊదాలి. పుట్టినప్పుడు ఉండే కొత్తదనమే, పునర్జన్మకు ముందూ ఉండాలి.

‘నా కుగాదులు లేవు, నా కుషస్సులు లేవు / నేను హేమంత కృష్ణానంత శర్వరిని
నాకు కాలమ్మొక్కటే కారురూపు... నా శోకమ్ము వలెనె, నా బతుకు వలె, నా వలెనె’-
అనిపిస్తే... ఇంటి బయటికి రండి. వేపచెట్టును చూడండి. మామిడి చెట్టును చూడండి. చెరకు గడలను చూడండి. మిరపతోటలను చూడండి. ఉప్పు కయ్యలను చూడండి.
ప్రకృతి నిండా రుచులున్నాయి. నిరాశ అనే రుచి ఎక్కడా లేదు. ప్రకృతిలో లేనిది జీవితంలో మాత్రం ఎందుకుండాలి?

1 comment:

  1. మీ ఆకాంక్ష నెరవెరాలని కోరుతూ....ప్రవీణ్

    ReplyDelete