Sunday 18 June 2017

మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
..................................


చేతి సంచిలో 
ఎక్కాలబుక్కు, తెలుగువాచకం, రూళ్ళబుక్కు 
ఓ చెక్కపలక.. నాలుగు ఇరిగిపోయిన కనికలు
నటరాజ్ జామెంట్రీ బాక్సులో రెండు రేగొడియాలు
అప్పుడు అవే..
కోట్లగుమ్మరించి.. ఆకాశానికెదురేగి
రెక్కలకట్టుకుని.. పాలసముద్రాల్లో
తేలియాడుతూ.. జలకాలాడుతూ
బడిగంట సాక్షిగా.. బుల్లి చేతులతో ఒడిసి పట్టుకున్న
కేరింతల సమూహాలు
000
అప్పుడు
అ.. ఆలు దిద్దడం ఎంతతేలికో..
ఇంటిబెల్లు కొట్టేదాకా..
అమ్మ.. ఆవు.. ఇల్లు.. ఈగ
బండిరాలు.. గుండ్రంగా తిరగాల్సిందే
పలకైనా అరగాలి.. కనికైనా ఇరగాలి
ఎవరూ చూడకుంటే..
బుల్లి కనికిముక్క కొరుక్కుని
తినేయాలి.
పలకను దిద్దే పిండిలాంటి నల్లని కనిక
బడిలో చప్పరించే అవకాయ బద్దలాంటిది
అబ్బా.. తలచుకుంటే..
ఆ రుచే గమ్మత్తు.
0000
అప్పుడు
లేత భుజాలపై బరువుల్లేవు
టైలర్ కుట్టిన చేతిసంచిలోనే
తేలిగ్గా బడిచదువు సాగేది
బడిగంట ఇంటిదాకా వినపడేది
బడిగంటంటే పిల్లకాయలకే కాదు
పెద్దోళ్ళకూ వినడానికి ముచ్చటే
000
అప్పుడు బడంటే
తలకింత నూనె రాసుకుని
పళ్ళు, కళ్ళు మాత్రమే కనిపించేంత
మైసూర్ శాండల్ పౌడర్ మొఖానికి రుద్దేసి
చద్దన్నంలో బెల్లంముక్కో..
ఉల్లిపాయముక్కో నంజేసుకుని..
ముక్కెగరేసుకుంటూ
నాసామిరంగా
బడికెళ్తా ఉంటే..
నేలమీద
పచ్చగా విచ్చుకున్న పచ్చికపై
పావురాలు గుంపులా ఉండేది.
000
అప్పడు..
బాబ్డ్ హెయిర్ లు లేవు
మెడపైకి కత్తిరుంచుకున్న తలకట్టులూ లేవు
ఉంటే గింటే.. రెండుజెళ్ళ సీతాళ్ళు
ఉంగరాల జుట్టున్న మంగతాయార్లే
000
అప్పడది
లేతమనసుల్ని
ప్రేమగా కౌగిలించుకుని
నాలుగు లక్షణమైన అక్షర ముద్దల్ని
తినిపించే అక్షరాలసావిడి
లోకం తెలియని బాల్యంలో
రోజంతా..
కాసిన్ని నక్షత్రాల్ని
కాసిన్ని ఆటల్ని
కాసిన్ని పాటల్ని
ముద్దాడుతూ గడిపేసిన రోజులవి
అందుకే..
మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
-గంగాధర్ 

No comments:

Post a Comment