Tuesday 1 November 2016

నాన్నొచ్చాడు.. దీపాలు తెచ్చాడు
..............
అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడే? అంటే..
దీపావళి పండక్కి వస్తాడ్రా పెద్దోడా.. అంది
దీపావళి ఎప్పుడొమ్మా? అంటే
ఎల్లుండేరా అని ఊరించింది
నాకేమో.. దీపావళి అంటే బోల్డంత ఇష్టం
చిచ్చుబుడ్డులు
భూచక్రాలు
విష్ణుచక్రాలు
తాటాకు టపాసులు
పాము బిళ్ళలు
అగ్గిపెట్టెలు
మతాబులు
కాకరపువ్వొత్తులు
ఉల్లిపాయలు.. అంటే నేలటపాసులు
ఎప్పుడు కొనుక్కోవాలే అమ్మా.. అంటే
నాన్న రేపొత్తాడుగా.. అంది
..
రేపే దీపావళి
ఇంకా నాన్న డ్యూటీ దిగలే
నాన్న లారీ డ్రైవర్
నేషనల్ పరిమిట్ ఉన్న పెద్ద డ్రైవర్
డ్యూటీకెళ్ళాడో..
పదిహేను, ఇరవై రోజులికిగానీ ఇంటికి చేరడు
నాన్న ఇంకా డ్యూటీ దిగలేదు
రేపే దీపావళి..
టపాసులు కొనుక్కోవాలి
అమ్మదగ్గర డబ్బుల్లేవు
నాన్న వస్తేనే పండగ
000
అమ్మా.. ఇయ్యాలే పండగ కదా
నాన్న ఇంకా రాలేదు అంటే..
వత్తాడ్రా పెద్దోడా.. అంది
..
ఇరుగు పొరుగు
దీపాలు వెలిగించేశారు
పక్కింటి శీనుగాడు
టపాసలు కాలుత్తున్నాడు
మా ఇంట్లో్ దీపాలు ఇంకా ఎలగలేదు
000
అదిగో అప్పుడే
మాసిన గెడ్డంతో
మురికిపట్టిన బట్టలతో
నాన్న వచ్చేశాడు
వస్తూ వస్తూనే
రేయ్ పెద్దోడా.. పద..
పటాసులు కొనుక్కుందాం అన్నాడు
అమ్మకళ్లల్లో ఇప్పడు దీపాలు ఎలిగినాయ్
నేను, నాన్నబజార్ కి పోయాం
ఏబై రూపాయలకి
సంచుడు టపాసలు
మోసుకొచ్చాం
హమ్మయ్య
మా ఇంట్లోనూ దీపాలు వెలిగాయ్
టపాసలు పేలాయ్!!
-గంగాధర్ వీర్ల
(నాన్న అందించిన చిరుదివ్వెల జ్ఞాపకాలతో..)




No comments:

Post a Comment