Wednesday 6 July 2016

// క్యా బాత్ హై //
నిక్కర్లు వేసుకునే వయసులో
అన్వర్ గాడు నేనూ
ఒకే జీడిని కాకెంగిలి చేసుకుని తినేవాళ్ళం
వాడు మా ఇంటికొస్తే
అమ్మ చేసిన చింతపండు పులిహోర
ఎంతో ఇష్టంగా ఆమ్మని తినేశేవాడు
మహా మహా సొగ్గాడు
రోజంతా అత్తర్లతో ఘుమఘమలాడేవాడు
ముచ్చటపడితే నాచొక్కాక్కూడా
కూసింత పోసేవాడు
000
హైస్కూల్ చదివే రోజుల్లో
జానీగాడు నా బెంచ్ మేట్
భుజాలల్లుకుని, కాలరెగరేసుకుని
ఊరంతా తిరిగేవాళ్ళం
దారిపొడుగునా
తియ్యని సేమ్యా కబుర్లే
వాడు స్కూల్ కి రానిరోజూ
నాక్కూడా కడుపునొప్పి వచ్చేసేది.
కుంటిసాకుతో సగం బడికి ఎగనామం
హుషారుగా జానీగాడింటికి పరుగే పరుగు
000
మీసాలొచ్చాక..
షరీఫ్, యాకూబ్, ఖదీర్, రఫీ, హుస్సేన్
ఇంకా చాలామంది ఆప్యాయతను పంచిపెట్టే దోస్తులయ్యారు
000
ఒకప్పుడు అన్వర్, జానీగాడు
తర్వాత షరీఫ్, యూకూబ్, ఖదీర్, రఫీ, హుస్సేన్
పేర్లు మారాయి అంతే..
అవే స్నేహాలు
అవే ఆప్యాయతలు
-గంగాధర్ వీర్ల
06-07-16

1 comment: