Tuesday 22 March 2016

నో.. ‘కలర్’ కరెక్షన్

లంకపొలంలో శీనుగాడు
గుర్రమెక్కాడు..
అది గుర్రం కాదు.. కర్రి ఎద్దు
శీనుగాడూ నలుపే..
ఎద్దూ నలుపే
అందుకే కర్రెద్దు వాడికి గుర్రమయ్యింది
గుర్రానికేమో వాడు రాజయ్యాడు
లంకంత పొలానికి గోపబాలుడే వాడు
0000
బడికెళ్ళే మొఖానికంతా
అమ్మ రాసిన పౌడరంట
నున్నా నున్నాని మధ్య నూనె పాపిడంట
మొఖమంతా తెల్లగా మెరవాలంట
బడికెళ్ళే మొఖానికంతా
అమ్మరాసిన పౌడరంట

తెలతెల్లాని చిన్నోడు అందమందు
తెల్లని చందమామ.. చూసి చిన్నబోదామరి
0000
పంతులారాబ్బాయి
బహుతెల్లగున్నాడంట
బడిలో.. గుడిలో భలే భలే మాట్లాడతాడంట
నుదిటిమీద ఎర్రని తిలకమంట
తెల్లని పంచెకట్టు వేషమంట
0000
సలీంగాడు..
ఏదడిగినా క్యాజీ.. క్యారే అంటాడు
రంజాన్ నాడు ఆవోభాయ్ అంటాడు
మా ఇంటిల్లిపాదికి ప్రేమగా సేమ్యా తేస్తాడు
చందమామలాంటోడు
రామ్.. రామ్ అంటూ
ఒకటే మాయ చేస్తాడు
0000
శీనుగాడు కర్రోడు
పంతులారబ్బాయి తెల్లోడు
సలీంగాడు పసుపుఛాయగలోడు
నేనేమో చామన ఛాయోడ్ని
మా రంగులు కలిశాయి
ఆప్యాయతలు రంగరించాయి
నో.. ‘కలర్’ కరెక్షన్
-గంగాధర్ వీర్ల/22-03-16






No comments:

Post a Comment