Wednesday 7 October 2015


::కిటికి::  

పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం!


                 వస్తున్నాయి పిల్లలకు సెలవులొస్తున్నాయి. ముప్పొద్దులా చదివి చదివీ అలసిపోతున్న స్కూల్‌ చిన్నారులకు విద్యా సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చే సెలవులు ఆటవిడుపులవుతాయి. బడి నుంచి కాలేజ్‌ వరకూ వయసులో తేడాలున్నా సెలవులంటే చాలు వారి ముఖాలు ఫిలిప్స్‌ బల్బుల్లా ధగధగలాడతాయి. విద్యార్థిలోకం ఆశగా ఎదురుచూసే సెలవుల్లో దసరా హాలీడేస్‌ ఒకటి. మాగ్జిమమ్‌ పదిహేను రోజులు, లేదంటే మినిమమ్‌ పదిరోజులు ఎంచక్కా స్కూల్‌కెళ్ళే పనే ఉండదు. పుస్తకాలతో కిక్కిరిసిపోయి నెలకొకసారి పంచర్‌ అయ్యే ఉల్లిపాయ సంచంత బరువాటి బ్యాగ్‌ల మోతకు కాసేపు బ్రేక్‌నిచ్చే సమయమిది. 'వచ్చేస్తున్నారు వస్తున్నారు జగన్నాథ రథచక్రాలు!' అన్నట్టుగా 'వచ్చేస్తున్నారు.. వస్తున్నారు దసరా సెలవులొచ్చేస్తున్నారు..!' పెద్దలూ బీరెడీ?!
***
''పెద్దలూ బీరెడీనా...?! ఇదేంటి.. పిల్లలూ.. బీరెడీ అనాలిగా?! '' అని ఇదేదో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ అనుకోవద్దు. నిజానికి సెలవులొస్తే.. రెడీ కావాల్సింది పిల్లలు కాదు. పెద్దలే. ఎందుకంటారా? అయితే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళాల్సిందే. వెనక్కంటే ఎక్కడికో కాదండోరు. జస్ట్‌ ఫ్లాష్‌బ్యాక్‌లోకి అన్నమాట. నిక్కర్లు వేసుకుని పలకాబలపం, వీలైతే రెండు నోటు పుస్తకాలు చంకలో పెట్టుకుని, బడికెళ్లిన రోజులన్నమాట. ఆ.. వెళ్ళారుగా.. అప్పుడు కూడా మనకు సెలవులొచ్చాయిగా.. వచ్చుంటారు.. వచ్చుంటారు. జస్ట్‌ ఫ్లాష్‌బ్యాక్‌ రింగుల్లోకి వెళదాం. వెళితే గిళితే గనక మనమూ బడికి సెలవులు ఎప్పుడొస్తాయా?! అని ఎదురుచూసిన వాళ్ళమే అయ్యుంటాం. ఆ ఎదురుచూపుల్లో అందమైన జ్ఞాపకాలెన్నో. నాటి బాల్యం గడిచిన తీరంలో ఏరుకున్న అపురూపమైన గులకరాళ్ళెన్నో.
***
జ్ఞాపకాలు.. ఒకటా, రెండా..?! చిన్నప్పటి మిఠాయి పొట్లం విప్పి చూస్తే అవి.. బోల్డన్ని. అప్పుడు తాతయ్య భుజాన వేలాడుతూ.. ఉయ్యాలలూగిన ఊసులున్నాయి. మామయ్య కట్టిన ఎడ్లబండిపై ఊరేగుతూ.. చెరువుగట్టు ఆసరాగా గరువు పొలమెళ్ళి, చెట్లెక్కిన సందర్భాలున్నారు. మధ్యాహ్నాం కాగానే జీడిమామిడి చెట్టు కింద అన్నం ముద్దలు చేసి, కొసరి కొసరి తినిపించిన వ్యవసాయకూలీల గారాబాలున్నాయి. అంతేనా?! అమ్మమ్మ చేసిన సున్నుండల తీపి, నాన్నమ్మ పంచిపెట్టిన కొబ్బరిలౌజు రంజు, మూడుపూటలా కడుపుబ్బరం చేసేంత నెయ్యి, పప్పన్నాలు. అబ్బో బ్రహ్మాండమైన తీపికబుర్లు. సాయంత్రం దుర్గమ్మ గుడి దగ్గర రోడ్డుకి అడ్డంగా తెల్లటి తెరకట్టి ఆడే ''బొబ్బలి పులి'', ''ఖైదీ'' సినిమాలు 'ఈరోజు రాత్రి..' అనే ఎనౌన్స్‌మెంట్లు. అప్పుడు దసరా పందిట్లో ఆడిందే ఆట పాడిందే పాట.
***
సెలవుల్లో ఊరెళితే..పెద్దమ్మ, పిన్నమ్మల ఆలింగనాలు, చిన్నత్త పెద్దత్తల బుగ్గ గిల్లుళ్ళు. బాబారు, పెదనాన్న పంచిపెట్టే చిల్లరడబ్బులు. ఎన్నెన్ని అనుభూతులు. ఎన్నెన్ని అనుబంధాలు. తలచుకుంటే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి చక్కలిగింతలే. ఆరుబయట ఆటల్లో పొరుగింటి సీతాలు, వెనకింటి శీనుతో జత కట్టడాలు.. ఊరు విడిచి వస్తున్నప్పుడు.. ఏదో పోగొట్టుకున్నంత ఫీలింగ్‌.. నాలుగురోజులు ఊరు పంచిన బంధాన్ని విడిచి రావాలంటే మనసంతా ఒకటే భారం. ఏడుపొక్కటే తక్కువ. అటు పెద్దలు.. ఇటు పిల్లల మధ్య ఆప్యాయతల దోబూచులాట. ''మళ్ళీ ఎప్పుడొస్తావురా బుజ్జీ..?'' అనే అప్పగింతల నడుమ చెమ్మగిల్లిన కళ్ళు. ఇవన్నీ నాడు పండుగ సెలవుల్లో దొరికిన ఆణిముత్యాలు.
***
మరి మన పిల్లలకీ ఇలాంటి అనుభవాలు వద్దా..!? ''ఎట్లా సాధ్యమయ్యేది.. కుదిరేది..? పట్నం చదువులు.. పట్నం సావాసాలూ.. కాలు కదపని ఉద్యోగాలు. ట్రాఫిక్‌ జామ్‌లు, ఫ్లైవోవర్లు దాటుకుంటూ కిక్కిరిసిన వ్యానుల్లో బడికెళ్ళే మన పిల్లలకీ ఏడాదిలో ఒక్కసారైనా పల్లె అనుబంధాన్ని పంచలేమా? పిజ్జా కార్నర్‌లు, ఐమాక్స్‌ థియేటర్ల సినిమా షోలు, థీమ్‌ పార్క్‌ సరదాలు, వీడియో గేమ్‌ సెంటర్లలో కాలక్షేపాలు.. ఇవే సెలవులకు ఆటవిడుపులు అవుతున్నాయి. 'గ్రాండ్‌ మా, గ్రాండ్‌ పా, అంకుల్‌..!' అని గుర్తు చేసుకోవడమే తప్ప.. నేషనల్‌ హైవే దాటి ఊరు తీసుకెళ్ళే సాహసం చేస్తున్నామా..?! లేదు లేదు.. సమ్‌థింగ్‌ మిస్సవుతున్నాం. ఒకప్పుడు మనకు పల్లె పంచిన బాల్యాన్ని మన పిల్లలకు దక్కకుండా చేస్తున్నాం?! పట్నంలోని ఇరుకైన గదుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, తాతయ్యలకు చోటులేని పరిస్థితిలో 'పెద్దరికం' మన మధ్య ఓ నల్లపూసే. ఏదో మిస్సవుతున్నాం. మన పెద్దల్నే కాదు, పుట్టి పెరిగిన బాల్యాన్నీ మిస్సవుతున్నాం. ఆ బాల్యపు సంగతుల్ని ముడివేసుకున్న ఊరునీ మర్చిపోతున్నాం. అందుకే.. దసరా సెలవులొస్తున్నారు.. పిల్లలతో ఊరెళ్ళి పెద్దవాళ్ళని పలకరించి, పండుగ చేద్దాం..! గుప్పెడు అనుభూతుల్ని మోసుకొద్దాం..!!
- గంగాధర్‌ వీర్ల 

No comments:

Post a Comment