Wednesday 21 September 2016

వాన
..............
వాన
అనుకున్నంత సుందరం కాదు.
కవితాత్మకం అంతకన్నాకాదు
వానలో ఎంతటి జాణతనముందో
అంత జాలితనమూ ఉంది
000
వానను గుప్పెట పట్టినప్పుడు
అక్షరాలు మల్లెతీగలై
ఒళ్ళంతా అల్లుకుపోవచ్చేమో?!
000
వాన జలధరింపుకు
పొగలు చిమ్ముకున్న
'కాఫీ' రాగాలు గుర్తుకురావొచ్చేమో?!
000
వాన.. మన చుట్టూతా
ముసురుకున్నప్పుడు
యతిప్రాసలు
గనవిభనజలు
సందులు, సమాసాలు
కవితాప్రపపంచాన
నువ్వానేనా అని పోటీపడొచ్చేమో?!
000
వాన గిచ్చుల్లకు
రొమాంటిక్ తలపుల్లో
అలా తడిసి ముద్దయిపోవొచ్చేమో?!
ఇంకా ఇంకా అనేకనేకాలుగా
వానలో తరిస్తాం.. పరవశిస్తాం
కానీ.. కానీ
వానలో ఎంతటి జాణతనముందో
అంత జాలితనమూ ఉంది
000
అక్కడ
వాన వానగాలేదు
పూట కూలి దొరకని చోట
పస్తులతో తడుస్తోంది
ముంచెత్తిన పంటల సాక్షిగా
రైతు కళ్ళల్లో కన్నీరవుతోంది
కుండపోతలోనూ
చక్రాల బండో.. రిక్షానో లాగుతూ
చెమట చుక్కవుతోంది
మురికివాడల్లోకి చొరబడి
పేదల గుడిసెల మధ్య
కాలవై పొంగుతోంది
000
వాన వానగా లేదు
అనుకున్నంత సుందరం కాదు.
కవితాత్మకం అంతకన్నాకాదు
-గంగాధర్ వీర్ల
21-09-16

No comments:

Post a Comment