Saturday, 21 May 2016


పీచుమిఠాయండోయ్
పల్లవి:
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం -2

చరణం:
తారంగం తారంగం
పుల్లకు చుట్టే తారంగం
నోట్లో కరిగే తారంగం
గొంతులో జారే తారంగం
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం

చరణం:
నోటిలో కరిగెను తారంగం
పీచమణిగెను తారంగం
జీడికడ్డీ అయ్యెను తారంగం
కొరికితినేశాను తారంగం
తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం

చరణం:
నోరంతా తీపయ్యే తారంగం
మూతి గులాబిరంగయ్యే తారంగం
చెడ్డీ, గౌనుకి జిడ్డయ్యే తారంగం
వేళ్ళన్నీ చప్పరించేసాలే తారంగం

తారంగం తారంగం
పీచుమిఠాయి తారంగం-2

-గంగాధర్ వీర్ల, 21-05-2016


   

Thursday, 19 May 2016

వానా.. వానా
.............................
1
చల్లని స్పర్శమీటంగానే
మనసుకి రెక్కలొచ్చేశాయి
వీహాంగమై.. కరిమబ్బు మేఘమై
చినుకు.. చినుకూ వాలిన చోట
మొఖానవాలిన తడి చెమ్మనై
000

2
తాపమోడ్చిన నెరల్లో
ఆమాంతంగా వాలిన
నీ బిగికౌగిలి జలదరింపు
నానిన గుండెల్లో
పుడమి వాకిట ఏదో కవ్వింపు
000
3
తడిసిన శరీరాన్ని
అలాగే వదిలేయాలన్నంత ఆనందం
ఆకాశంవైపు చూస్తూ
ఇంకా ఇంకా తడిసి ముద్దయిపోవాలనే ఆరాటం
నేను భూమిని
కుంభవర్షంలా
రావోయ్.. నావళ్ళంతా చల్లగా చుట్టేసుకో
000
4
నిండువేసవి
చీల్చుకుని వానొచ్చే
వానతోపాటు వయ్యారమొచ్చే
చల్లని పలకరింతొచ్చే
పుడమి విచ్చుకున్న పలవరింత వచ్చే
వానా..వానా
నీతో నేను..
తుళ్ళింతల దివానా

-గంగాధర్ వీర్ల
ఈ వర్షం సాక్షిగా.. 19-06-2016

 

Tuesday, 17 May 2016

డోంట్ బీ లైక్ దట్

ఎవరికోసం నిట్టూర్పు
దేహం రెండుగా చీల్చినట్టుందా!?
మేబీ.. ఉండొచ్చు
కాంక్ష వేరు.. ఆ కాంక్ష వేరు
రెండింటికీ మధ్య చాలా ఆగాధం ఉందేమో
000
నాలోకి అలా కఠినాత్మకంగా తొంగిచూస్తే
ఎర్రని రక్తకణాలతో నిండిన
దేహమే కనపడొచ్చు
ఇంకా వైవిధ్యంగా వెదుకు
కాసిన్ని ఆలోచనల్ని
సుతారంగా అదిమిపట్టి
నన్ను పట్టుకోడానికి
ప్రయత్నించు
ఏమో.. ఏదో ఒక రూపంలో దొరుకుతానేమో
000
ఇప్పటికీ దేహం..
రెండుగానే చీల్చినట్టుగానే ఉంది
ఒకటి అనుభవం
మరొకటి విధ్వేషం
మనిషి లోపలి పొరను పట్టుకోవడం
నీకెందుకు సాధ్యం కావడంలేదు
000
ఇప్పటికీ నా దేహం
రెండుగా చీలినట్టుగానే ఉంది
కాదు.. కాదు..
అనవసరపు వెదుకులాటలో
నా దేహాన్ని
ఎవరో కావాలనే చీల్చినట్టుగా ఉంది
హేయ్.. డోంట్ బీ లైక్ దట్!!
-గంగాధర్ వీర్ల, 17-05-20016

Tuesday, 22 March 2016

నో.. ‘కలర్’ కరెక్షన్

నో.. ‘కలర్’ కరెక్షన్
....................................
#HappyHoli

1.
లంకపొలంలో శీనుగాడు
గుర్రమెక్కాడు..
అది గుర్రం కాదు.. కర్రి ఎద్దు
శీనుగాడూ నలుపే..
ఎద్దూ నలుపే
అందుకే కర్రెద్దు వాడికి గుర్రమయ్యింది
గుర్రానికేమో వాడు రాజయ్యాడు
లంకంత పొలానికి గోపబాలుడే వాడు

2.
బడికెళ్ళే మొఖానికంతా
అమ్మ రాసిన పౌడరంట
నున్నా నున్నాని నూనె జుట్డుకు నూనె పాపిడంట
మొఖమంతా తెల్లగా మెరవాలని
బడికెళ్ళే మొఖానికంతా.. అమ్మరాసిన పౌడరంట
తెలతెల్లాని చిన్నోడు అందం చూసి
తెల్లాని చందమామ.. చిన్నబోదామరి

3.
పంతులారాబ్బాయి
బహు తెల్లగున్నాడంట
బడిలో.. గుడిలో భలే భలే మాట్లాడతాడంట
నుదిటిమీద ఎర్రని తిలకమంట
తెల్లని పంచెకట్టు వేషమంట

4.
సలీంగాడు..
ఏదడిగినా క్యాజీ.. క్యారే అంటాడు
రంజాన్ నాడు ఆవోభాయ్ అంటాడు
మా ఇంటిల్లిపాదికి ప్రేమగా సేమ్యా తేస్తాడు
చందమామలాంటోడు
రామ్.. రామ్ అంటూ
ఒకటే మాయ చేస్తాడు

5.
శీనుగాడు కర్రోడు
పంతులారబ్బాయి తెల్లోడు
సలీంగాడు పసుపుఛాయగలోడు
నేనేమో చామన ఛాయోడ్ని
మా రంగులు కలిశాయి
ఆప్యాయతలు రంగరించాయి
నో.. ‘కలర్’ కరెక్షన్

-గంగాధర్ వీర్ల
-22-03-16






Monday, 21 March 2016

Feel My Illusion 

నింగిలో..
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నక్షత్రాలతో చేయీ చేయీ కలపాలని ఉంది
ఉల్లిపొరలాంటి చల్లని మేఘంపై
కాసేపు ఉయ్యాలూగాలని ఉంది
ఆనక..
చందమామా రావే..

జాబిల్లి రావే.. అని

అమ్మ నేర్పిన పాటను..
ఆ జాబిలమ్మకే వినిపించాలని ఉంది
........
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నాలో నేను మాట్లాడుకోవాలి
ఆనక.. అలసిపోయి
కునుకుతీయాలి
రాత్రి జాగరపు సంగతుల్ని
పగలంతా నెమరు వేసుకోవాలి

Feel my Illusion ...!!

Gangadhar/World poetry day/21-03-2016 

Thursday, 4 February 2016

హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్టూ....!? ..... మనసైనా.. శరీరమైనా... ఆనందపడ్డం అనేదాన్ని ఏదో.. ఒక్క కోణంలోనే చూడ్డం పొరపాటు. భార్యభర్తల మధ్య ఉండే శారీరక, మానసిక బంధంతో.. దక్కించుకునే ఆనందం ఒకలా ఉంటే, తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్లోంచి దక్కే ఆనందం మరొకలా ఉండొచ్చు. బిడ్డలకు ఏలోటూ లేకుండా కోరినవి కొనిచ్చామనే ఆనందం ఒకలా ఉంటే.. పిల్లల్ని దగ్గరగా తీసుకుని, వారి కళ్ళల్లోకి కళ్ళుపెట్టి మనసారా వారు చెప్పే మాటలు వింటూ.. అలా ఆదమరచి గడిపే క్షణాల్లో దక్కే ఆనందం మరొకలా ఉండొచ్చు. మంచి స్నేహంలోనూ ఆనందం ఉంది. అలాగే పడరాని స్నేహాలకు దూరంగా ఉండగలుగుతున్నామనే దాంట్లోనూ ఆనందం ఉంది. ఇలా ఆనందం అనేది మనం చూసే కోణంలోనూ, పెంచుకునే అనుబంధంలోనూ, తృప్తిలోనూ ఉంటుంది. దానికి మన చుట్టూ అల్లుకున్న అనుబంధాల్లోంచి సానుకూలమైన ఆనందాన్ని అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సిన పని.
-గంగాధర్ వీర్ల
05-0216

Thursday, 21 January 2016



వాటీజ్ యువర్ కలర్?!
..
కులానికి రంగుందా!
ఏమో ఉండే ఉండొచ్చు
నల్లగా.. ఉండొచ్చు
ఎర్రంగానైనా ఉండొచ్చు
మధ్యరకంగానూ ఉండొచ్చు
ఏదో ఒక రంగు ఉండే ఉండొచ్చు!!
000
ఒకవేళ..నల్లగా ఉంటే..
ఊరవతల ఉండమని,
ఆధిప(పై)త్యపు గీతదాటొద్దని
శపించేస్తారేమో!?
పోనీ తెల్లగా ఉంటే?!.
మడికట్టుకుని వేదాలు వల్లించమంటారా!?
పోతేపోనీలే మనోడే కదా అని
అగ్రకులపు మెడలేసి పటేల్ ని చేసేస్తారా!?
అసలు కులానికి రంగుందా?!
ఏమో..ఉండే ఉండొచ్చు.
000
అన్నట్టు.. అదిగదిగో
అక్కడో కులం ఎర్రగా ఉంది
ఎర్రగావున్న ఆ కులపోడి రకతం
సలసల ఉడికిపోతుంది.
అరె.. ఇక్కడ ఈ కులం నల్లగా ఉందే..
అయినా ఈ కులపోడి రకతం కూడా
సలసలా కాగిపోతుంది. అదెట్టా!?
అన్నికులపు రకతాలు వేడిగానే ఉన్నాయి
రగిలేపోతూనే ఉన్నాయి
000
ఓరి దేవుడోయ్..
ఎవరో..కులానికి రంగేస్తున్నారు
రంగుతోపాటు ముసుగులూ కప్పుతున్నారు
ఆడు.. వీడు.. మనోడు.. కానోడు
అని వీరంగం వేస్తున్నారు..
చదువులమ్మ బడిలోకి
సిగ్గూఎగ్గూ లేకుండా దూసుకొచ్చి
పూనకం వచ్చిన కోతుల్లా
వీరంగమాడుతున్నారు
అరె ఎవర్రా.. అదీ?!
000
మనిషి అస్తిత్వానికి మాత్రమే ఓ కులం
మరి..అస్తిత్వమంటే?!
మనిషిలోంచి మనిషిని
వేరు చేయడమా?!కాదురోయ్
ఆత్మాభిమానంతో బతకడం
బతుకుదామని చెప్పడం
కులాల గుంపుగా..
సంఘజీవనం చేయడం
...
కులానికి రంగులేదు
కులం అంటే ఎవరో కాదు, మనిషే
ఆ.. మనిషిలో రకతం ఉంది
ఆ రకతానికి మాత్రమే.. ఎర్రని రంగుంది
అందరిలోనూ.. అదే రంగు
మరి మనిషి అనే కులానికి
రాజకీయ రంగులా!?
తప్పు.. తప్పు.. తప్పు!!!

-గంగాధర్ వీర్ల, 21-01-2016