శీర్షిక:
న్యూ- ట్రాన్స్ ఫర్మేషన్
....
కాలంతోపాటే మనం
మనతోపాటే కాలం
కాలమొక.. ప్రవాహం
ఆ ప్రవాహంలో పయనించే
పడవనో.. నౌకనో
అంతర్భాగపు రహస్యాలను
భావాలను, భావోధ్వేగాలను
శోధించే, ఛేదించే దర్శించే..
ఎక్కడో.. అగాధాన..
విశాల గర్భస్థలలిలో దాచుకునే..
నడసంద్రపు
జలాంతర్గామిగానో..
మారాలి.. మారుతూ ఉండాలి
ఎందుకంటే.. కాలానికి
లెక్కలుంటాయి.
అందులో
మన సంచారపు గమనానికీ, జననానికీ
గుప్పెడు లెక్కలు మిగిలే ఉంటాయి.
ఆ లెక్కల్లో కొన్ని ఆశలు.. మరికొన్ని కోరికలు
కొన్ని ప్రేరణలు, ఇంకొన్ని ఆరాధనలు
ఆక్షేపణలు, అవరోధాలు, అనుకరణలు
అనుసరణలు, అలంకృత సంచారాలు
ఇంకా ఏవో..ఉండనే ఉంటాయి.
వెదకాలి.. జల్లెడ పట్టాలి.
ముత్యపు చిప్పల్లో దొరికే
స్వాతిచినుకుల్ని ఏరుకోవాలి
000
కాలం కొత్తది
నిత్యం..
కొత్త నడక నడూస్తూనే..
గతకాలపు తలపు రెక్కల్లో దాచుకున్న పూర్వాపరాలకు
తనో సాక్ష్యంగా కొత్తగా మనతోనే సాగుతూనే ఉంటుంది
నిన్నటి రోజు.. ఓ అనుభవం
ఆ అనుభవంలోనే..
పాలు-నీళ్ళుగా తారసపడే.. తారాడే జాడలూ ఉంటాయి
మనకు మాత్రమే తెలిసిన.. అంతర్ముఖాన్ని తడిచేసే
శృతిచేసే, సవ్వడిచేసే అలల తీరాలూ ఉంటాయి
000
అదిగో.. కొత్తసొబగులు దిద్దుకుని
క్యాలండర్ పుట మారుతోంది.
కొత్తగా ఉండాలి.. కొత్తగా బతకాలి అంటే
బలంగానో. బలవంతంగానో
బ్రెయిన్లో పాతుకుపోయిన డిఫాల్ట్ ప్రోగ్రమ్డ్ చిప్ ను తీసేయాలి
అందుకు ఏదో.. ఇంకోదే.. చేయాలి
ఆదమరచి ప్రకృతి ఒడిలో తిరుగాడే
ఓ సీతకోక చిలుక వీహాంగంలా
హరివిల్లు రంగుల్లో మన కోసం ఓపూలదారి వెదుక్కోవాలి
అందుకే..
ఉయ్ షుడ్ చేంజ్ విత్ న్యూ బ్రెయిన్డ్ ప్రొగ్రామ్
000
కొత్తదనపు వాకిలి తెరవడమంటే..
నిన్న గడిపిన క్షణాలను తడుముకుంటూ
రేపటి గమనానికి ఓ అందమైన స్వాగతం పడలకడమే
డియర్ అండ్ డియర్స్.. కమాన్
జాయిన్ టుగెదర్
కొత్తగా.. ఇంకాస్త కొత్తగా స్నేహంగా..
నేలపై అప్పుడే మొలచిన, మొలకెత్తిన
ఓ లేలేత గడ్డిపువ్వును చూసిన ఆనందంలా
చల్లని కేరింతలా..
మన పిల్లాడి లేలేత బుగల్ని తడిమిన
అనుభవంలా.. మాటలకందని మురిపెంలా..
మనసులో ఓ కొత్త ట్యూన్ కడదాం..
పదండి.. గుప్పిట్లో దాచుకున్న
నక్షత్రాల వెలుగుల్లో
చిగురిస్తున్న కొత్త ఆశల్ని
ఒళ్ళంతా పులుముకుందాం!!
-గంగాధర్ వీర్ల







