Monday, 15 December 2025

 బాపు గారితో నేను.. ( ఓ కార్టూనిస్ట్ సెల్ఫ్ డబ్బా)

***********************************************
పాతకేళ్ళ క్రితం సంగతి. ఇంచుమించు నాది కూడా పాతికేళ్ళ ప్రాయమే. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభ దశ అది. ప్రజాశక్తిలో ఎడిటోరియల్ కార్టూనిస్ట్ హోదా. స్వతహాగా రాతగాడిని(అని నా భ్రమ) కనుక, పనిచేసేది కూడా వామపక్షపార్టీ ఆధ్వర్యాన సుధీర్ఘ అనుభవంతో నడిచే పత్రిక కనుక, అంతర్జాతీయ, దేశ, వర్తమాన, రాజకీయ, సామాజిక పరిణామాలపై అక్కడి సీనియర్లు అయిన వి.శ్రీనివాసరావు గారు, వినయ్ కుమార్ గారు, తెలకపల్లి రవి గారు ఇలా అనేకమంది సహకారంతో అంతో ఇంతో ఎడిటోరియల్ కార్టూన్లకు కావాల్సిన నాలెడ్జ్‌ను అవగతం చేసుకునే అవకాశం అక్కడ దక్కింది.
అసలే అవి.. గ్లోబలైజైషన్, ప్రయివేటైజేషన్, అమెరికాలోని జంట టవర్ల విధ్వంసం, గోద్రా సంఘటనలు, స్థానికంగా విద్యుత్ పోరాటాలు ఇలా వృత్తికి పదును పెట్టుకోగల పరిస్థితులు ఉండేవి. అలా ప్రజాశక్తి పేపర్లో ప్రతి రోజూ బేనర్ కార్టూన్లు, వ్యాసాల కోసం మరికొన్ని బొమ్మలు, క్యారికేచర్లు ఇలా రోజంతా ఎడాపెడా బొమ్మలు గీసే రోజులవి.
అత్యధిక సర్కులేషన్‌గల ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, భూమి వంటి పలు పత్రికల్లోని కార్టూన్లకు భిన్నమైన థీమ్ తో.. వర్తమాన రాజకీయ పరిస్థితులపై ధిక్కార స్వరంతో ప్రజాశక్తిలో వచ్చిన నాటి నా కార్టూన్లు చాలా సార్లు సంచలనాలయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో ప్లకార్డ్స్ రూపంలో నినాదాలుగాను కూడా పతాక శీర్షికలు అయ్యేవి.
ఇక ప్రజాశక్తి పత్రికలో నా రెండవ ఇన్నింగ్స్ అంటే 2014-2019 మధ్య కాలంలోనూ అమరావతి సాక్షిగా నా రాజకీయ కార్టూన్లు ప్రత్యేక ముద్రతో అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల తీరుని ప్రశ్నించేవి. డైరెక్టుగా వారికి, ఆయా పార్టీలకు తగిలేలా చురకలంటించేవి. అడపా దడపా నాపై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా దాడులు లాంటి చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతుండేవి. ఎందుకంటే, అప్పటి నా ధైర్యం వామపక్షం.
గతం గతః. ఇదంతా ఎందుకంటే, ప్రఖ్యాత చిత్రకారులు, తెలుగువారందరికీ సుపరిచితమైన బాపు గారిని తలచుకునే సందర్భంలో కాసేపు గతంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
నడమంత్రపు కాలంలో, మన గురించి పదిమందికి తెలియాలంటే కచ్ఛితంగా ‘నేను’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది నాలాంటి చాలా మందికి. సోషల్ మీడియాలో.. వర్తమానపు హంగులకే ప్రాధాన్యం ఎక్కవ కనుక పాత విషయాల్లోని అందమైన అనుభవాలను కొంతమందితోనైనా పంచుకోవడం తప్పడం లేదు.
చివరాఖరికి చెప్పేదేమంటే, నాడు 2000-2004 మధ్య కాలంలో ప్రజాశక్తి లో నేను వేసిన రాజకీయ కార్టూన్లు, ఇతర వర్క్స్ కి సంబంధిన ఫోటో ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్లో భారీగా ఏర్పాటు చేసిన పొలిటికల్ కార్టూన్స్ ఫెస్టివల్‌లో నా కార్టూన్ల ప్రదర్శన చిత్రానికి సాక్ష్యం ఇది.
ఇది కేవలం పొలిటికల్ కార్టూన్ల ప్రదర్శన కనుక అప్పటి ముఖ్యమైన పత్రికల్లో రోజువారి రాజకీయ కార్టూన్లు వేస్తున్న ఎడిటోరియల్ కార్టూనిస్టులకు ఒక్కొక్కరికీ ఒక ప్రత్యేక స్టాల్ కేటాయించారు. అలా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్ళలో నాకొక ప్రత్యేక స్టాల్ (డిస్ప్లే బోర్డ్స్) ఇవ్వడం నా వృత్తికి, నా వర్క్ కి ఇచ్చిన పెద్ద గౌరవంగా భావిస్తాను. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆహో ఓహో అనే డప్పులు, భాజాలకు దూరంగా ఉండే నాకు, నా జీవితంలో తృప్తిపడ్డ పెద్ద అవార్డు ఏదైనా ఉందంటే ఇదే.
కార్టూనిస్టులు మోహన్ గారు, చంద్రగారు, జయదేవ్ గార్లతోపాటు నాటి దినపత్రిక కార్టూనిస్టులైన సుభానీ గారు(దక్కన్ క్రానికల్), శంకర్ (వార్త), శేఖర్ గారు(ఆంధ్రజ్యోతి), మృత్యంజయ్ (ఆంధ్రభూమి) లతో కలిసి నా (ప్రజాశక్తి) కార్టూన్ల ప్రదర్శనను పంచుకోవడం ఒక చక్కటి అనుభవం. ఇదిగో.. అలా నా కార్టూన్ల ప్రదర్శన స్టాల్ ని.. ప్రఖ్యాత చిత్రాకారులు, కార్టూనిస్ట్, దర్శకులు బాపు గారు సందర్శించిన ఓ అపురూప సందర్భం. ‘‘మీ లైన్ బావుందండీ’’ అని బాపు గారు ఒక్కొక్కటిగా మెచ్చుకోవడం మరో పెద్ద అవార్డు.
- గంగాధర్ వీర్ల
నోట్:
ఫొటో షాప్, డిజిటల్ ట్యాబ్‌లు లేని రోజులవి. చక్కగా పెన్సిల్‌తో బొమ్మ గీసుకుని, సరాసరి ఇండియన్ ఇంక్ ఉపయోగించి బ్రష్ తో గీసిన చిత్రాలే ఇవి. ఇప్పుడు ఆ బొమ్మలు చూస్తుంటే, ‘‘అద్భుతం ఇంత బాగా గీసానా?’’ అని అనుభూతి చెందడం ఓ అనిర్వచనీయ అనుభవం. ఫోటోలో బాపుగారి పక్కన సన్నగా, రివటులా ఉన్నది నేనేనండోయ్.

No comments:

Post a Comment