Sunday, 18 June 2017

మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
..................................


చేతి సంచిలో 
ఎక్కాలబుక్కు, తెలుగువాచకం, రూళ్ళబుక్కు 
ఓ చెక్కపలక.. నాలుగు ఇరిగిపోయిన కనికలు
నటరాజ్ జామెంట్రీ బాక్సులో రెండు రేగొడియాలు
అప్పుడు అవే..
కోట్లగుమ్మరించి.. ఆకాశానికెదురేగి
రెక్కలకట్టుకుని.. పాలసముద్రాల్లో
తేలియాడుతూ.. జలకాలాడుతూ
బడిగంట సాక్షిగా.. బుల్లి చేతులతో ఒడిసి పట్టుకున్న
కేరింతల సమూహాలు
000
అప్పుడు
అ.. ఆలు దిద్దడం ఎంతతేలికో..
ఇంటిబెల్లు కొట్టేదాకా..
అమ్మ.. ఆవు.. ఇల్లు.. ఈగ
బండిరాలు.. గుండ్రంగా తిరగాల్సిందే
పలకైనా అరగాలి.. కనికైనా ఇరగాలి
ఎవరూ చూడకుంటే..
బుల్లి కనికిముక్క కొరుక్కుని
తినేయాలి.
పలకను దిద్దే పిండిలాంటి నల్లని కనిక
బడిలో చప్పరించే అవకాయ బద్దలాంటిది
అబ్బా.. తలచుకుంటే..
ఆ రుచే గమ్మత్తు.
0000
అప్పుడు
లేత భుజాలపై బరువుల్లేవు
టైలర్ కుట్టిన చేతిసంచిలోనే
తేలిగ్గా బడిచదువు సాగేది
బడిగంట ఇంటిదాకా వినపడేది
బడిగంటంటే పిల్లకాయలకే కాదు
పెద్దోళ్ళకూ వినడానికి ముచ్చటే
000
అప్పుడు బడంటే
తలకింత నూనె రాసుకుని
పళ్ళు, కళ్ళు మాత్రమే కనిపించేంత
మైసూర్ శాండల్ పౌడర్ మొఖానికి రుద్దేసి
చద్దన్నంలో బెల్లంముక్కో..
ఉల్లిపాయముక్కో నంజేసుకుని..
ముక్కెగరేసుకుంటూ
నాసామిరంగా
బడికెళ్తా ఉంటే..
నేలమీద
పచ్చగా విచ్చుకున్న పచ్చికపై
పావురాలు గుంపులా ఉండేది.
000
అప్పడు..
బాబ్డ్ హెయిర్ లు లేవు
మెడపైకి కత్తిరుంచుకున్న తలకట్టులూ లేవు
ఉంటే గింటే.. రెండుజెళ్ళ సీతాళ్ళు
ఉంగరాల జుట్టున్న మంగతాయార్లే
000
అప్పడది
లేతమనసుల్ని
ప్రేమగా కౌగిలించుకుని
నాలుగు లక్షణమైన అక్షర ముద్దల్ని
తినిపించే అక్షరాలసావిడి
లోకం తెలియని బాల్యంలో
రోజంతా..
కాసిన్ని నక్షత్రాల్ని
కాసిన్ని ఆటల్ని
కాసిన్ని పాటల్ని
ముద్దాడుతూ గడిపేసిన రోజులవి
అందుకే..
మళ్ళీ బడికెళ్ళాలని ఉంది!!
-గంగాధర్ 

మ్యూజింగ్
............
ఇలా వచ్చి
అలా వెళ్ళిపోడానికి
నేనేమీ.. చుట్టాన్నికాదు
నీలో ప్రేమ పుట్టకను!
-గంగాధర్ వీర్ల

Friday, 26 May 2017




వానొచ్చింది.. కానీ..?!
............................
పగోడిలా ఉరుముతూ
శత్రువులా ఘీంకరిస్తూ..
పెళపెళమంటూ
పెద్దపెద్ద అంగలతో
కొండంతలు దాటి
కరిమబ్బుల్నిఎలాగోలా చీల్చుకుంటూ
పిడుగుపాటు గద్దింపుతో
వానొచ్చింది
000
ఊరు ఊరంతా హోరై
చెట్లు చేమలు కకావికలమై
ఫలానికొచ్చిన పంటను
నిలువునా కూలిపోయేలా చేస్తూ
పేదోడి గుడెసెల్ని పీకి పందిరేస్తూ..
మొత్తానికి వానొచ్చింది
000
చిత్తడి చినుకుల కోసం
నెర్రలు చాసిన భూమితల్లీ
కడుపారా తడవనేలేదు
చల్లని సాయంకోసం నోరుచాచి
ఎండిన ఆకులతో..
వాడి..రాలిపోతున్న
చెట్ల దాహమూ తీరలేదు
మొత్తానికి వానొచ్చింది
000
వొళ్ళంతా ముళ్ళకంచెలా
చుట్టేసుకున్న ఎండ గుబులుకు
ఇన్స్టంట్.. పెయిన్ రిలీఫ్
మందుపూతలా..
కాసింత చల్లదనం తాకగానే..
తనువులో కాసేపు మైమరపు
విద్యల్లత పెళపెళల సాక్షిగా
ఆకాశం నుంచి
బాల్కనీలోకి వాలి.. జారి
ఐస్ ముక్కలా రాలిపడ్డ
కాసిన్నిచిటపటలకు పిల్లల కేరింత
000
ఎట్టకేలకు
బడబడమంటూ
గుండెలదిరే శబ్దాలతో
వానొచ్చింది. కానీ
ఏంటో మనసుకి
తృప్తేలేదు!!
-గంగాధర్ వీర్ల

Thursday, 25 May 2017



::మల్లెపూలు.. మల్లెపూలోయ్!! ::
Model: My dear better half Anju
.......................................
అనగగనా ఒకరోజు.. అది ఎండాకాలం
పొడవాటి పూలజెడ వేసుకుని..
ముఖానికి ఇంత పాండ్స్ పౌడర్ రాసుకుని..
కళ్ళంతా కాటుక పూసుకుని..
ఫ్రెండు.. సీతాలును చెలికత్తెలా వెంటేసుకుని..
ఆ సీతాలుతోనే.. భూమికి తాకే మల్లెపూల జడను..
ఫొటో స్టూడియోదాకా మోయించి.
అయిదడుగుల అద్దం ముందు..
పీటెక్కి మరీ.. పోజివ్వడం..
ఆ ఆడపిల్లకైనా మరపురాని జ్ఞాపకం
నిన్నటి రోజుల్లో
మల్లెపూల వాలుజెడ వయ్యారం
ఆ వయ్యారంలో దాగిన సింగారం
ఆ సింగారంలో.. వాలుజెడను మోస్తూ..
సిగ్గుల మొగ్గలయ్యే..మన బంగారాల
మురిపాలు అలాంటివి
000
అసలు..మల్లెపూలంటే..
అమ్మాయిలకు ఎంత ఇష్టమో..
అబ్బాయిలకూ అంతే ఇష్టం.
గౌన్లు, నిక్కర్లు వేసుకునే వయసు నుంచే..
మల్లెలతో మనకు అంతటి అనుబంధం ఉంటుంది.
అమ్మ సూది మొనలోంచి దారం తీసేందుకు..
ఇంకొక పక్కనున్న దారపు మొనను పంటిన బిగబెట్టి..
మల్లెమొగ్గల్ని ఒడుపుగా పట్టుకుని.. గుచ్చుతూ
నాలుగు మూరలు కళాత్మకంగా అల్లిన సందర్భాల్లో..
కళ్ళింత చేసుకుని.. అమ్మను తేరిపారా చూసిన జ్ఞాపకాలు
మనలో చాలామందికి గుర్తే.
000
అప్పట్లో... పూలజడ ఫొటోలేని
ఫోటో స్టూడియో ఏదైనా ఉందంటే..
అదొక పెద్ద వింత.
''మల్లెపూలు.. మల్లెపూలే!'' అంటూ..
వీధి చివర మలుపులో
పూలబ్బాయి.. గొంతువినపడగానే..
అమ్మకంటే ఆత్రంగా..
''అమ్మా పూలబ్బాయి వస్తున్నాడే..!'' అని..
అమ్మకు గబాగబా సమాచారం చేరవేయడంలోని మజా
మనకి ఇప్పటికీ గుర్తే.
000
మల్లెలు తల్లో పెట్టుకుని..
అమ్మాయిలెంత మురిసిపోయేవారో..
మల్లెలు తెచ్చే పరిమళపు సందళ్ళతోనూ..
ఊరు.. ఊరంతా అలాగే మురిసిపోయేది.
సొగసు చూడతరమా!!
ఆ వాలుజెడల చిట్టెమ్మల సొగసు చూడతరమా!!
-గంగాధర్ వీర్ల

Thursday, 13 April 2017

ఆవేశం..!
నిత్యగమన కవాతు
....................
చండ ప్రచండమై
ప్రజ్వలితమై
ఎర్రని కాంతియై
ఆకాశాన్ని తాకేలా
పైపైకి ఉబికినప్పుడే
అగ్నిపర్వతం బద్ధలయ్యేది
000
వేలకోట్ల సుదూర తీరాలను 
దాటుకుంటూ.. పరుగెడుతూ
రాత్రిపగలు..చెలరేగి 
ఎగసిపడ్డప్పుడే
సముద్రపు
కెరటాల జాడ తెలిసేది
000
గుండెలోతుల్లోని ప్రేమను 
మదించి
పరవశించి
నరనరాన 
తన్మయత్వం సాగిస్తూ
రెండు శరీరాలు 
ఏకమైనప్పుడే
మనిషి పుట్టేది
000
ఆవేశంలేకుంటే
భూమిలేదు.
భూమిపై విత్తులేదు
విత్తులోంచి పుట్టే మొలకలేదు
000
ఆవేశం
అనేక అనేక ఆవిష్కరణలకు పునాది
అనేకనేక ఉద్యమాలకు నాంధి
అనేకఅనేక పోరాటాలకు వెలుగుదివ్వె
000
ఆవేశం
కోట్లాది పరమాణువుల శక్తిని
నింగిలోకి తీసుకెళ్ళే ఆయుధం
ఆవేశం
నిత్యనూతన
విద్యుల్లతా సమూహం
000
ఆవేశం
బానిస సంకెళ్ళను తెంచిన
స్వాతంత్ర్యం
ఆవేశం
సమసమాజాన్ని వెలుగెత్తి చాటిన 
అనేక వాదాల సమూహం
000
ఆవేశం 
వెయ్యివసంతాల అక్షరసేథ్యం
ఆవేశం..
లెక్కకుమించి నిద్రలేని రాత్రుల
అంతర్మధనం
ఆవేశం
మరోకొత్త ఆవిష్కరణకు
ప్రారంభ సంకేతం
000
ఆవేశం మనోవైకల్యం కాదు
మనోజ్ఞఫలకాలను
చైతన్యపరిచే
నిత్యగమన కవాతు!!
000
ఆవేశం
మనోవైకల్యం కాదు
మానసికవికాసం
ఎందరికో దారిచూపే
ధర్మాగ్రహం
-గంగాధర్ వీర్ల

Tuesday, 4 April 2017

నిక్కరు-ఊరు-పానకం
..........................
బెల్లం పానకం
వడంపప్పు
వీలైతే చలివిడి కోసం
ముందే రోజు
పిల్లకాయలం
సవాలక్ష స్కెచ్ లు
మరచెంబు కంటే పెద్ద చెంబు
ఎక్కడుందా? అని.. ఇల్లంతా వెదకడం
అమ్మ చుట్టూ తిరిగి..
రకరరకాల చెంబులు పోగేయడం
స్టీలు క్యారేజీలు
లోటా చెంబులు
పెద్ద పెద్ద గలాసులు..
పానకపు వేటకు సిద్ధమయ్యాయి
000
తెల్లారింది.
రాములోరిగుడికాడ.
చలువ పందిళ్ళు.. మామిడి తోరణాలు
మైకులో లవకుశ, సంపూర్ణరామాయణంలోని
సినిమా పాటలు
ఇంట్లో.. మా పిల్లకాయలందరికీ
వళ్ళంతా.. తలారా స్నానాలు.. వీలైతే కొత్తబట్టలు
లేకపోతే.. ఇస్త్రీ బట్టలు
000
రేడియోలో.. భద్రాద్రి సంబరాలూ
బ్రేక్స్ లేకుండా అప్ డేట్స్
రాములోరి పెళ్ళికూడా అయ్యిందట
ఊరిగుడిలోనూ భాజాలు, మంత్రాలు.
రేయ్.. ఇక పొండర్రా.. అనగానే
ఇక పానకవేట ఒక్కటే మిగిలింది
ఊళ్ళో ఎండ పెరిగింది
శ్రీరామనవమిరోజు
ఎండబాగా కాస్తందట
అమ్మమ్మ చెప్పింది.
అయితేనేమీ..
నిక్కర్లు, గౌనులు.. కుదుమట్టమై
గుడికాడికి తీపిరాగాలు తీస్తూ
హుషారుగా పరుగెత్తాయి
000
పెద్ద పెద్ద గుండిగపై..
చల్లటి నీళ్ళతో కప్పిన తెల్లటి వస్త్రం.
మిరియాలు కలిపిన బెల్లంపానకం
చల్లంగా ఉండాలని ఐస్ ముక్కలు
గుడి ప్రాంగణమంతా తీపివాసనే
అంతే.. పానకం పోయడం మొదలైంది..
మా చెతుల్లోని చెంబులన్నీ
పానకం కోసం
ఎగబడ్డాయి.. పోటీపడ్డాయి
చెంబు నిండా పానకం ఇంటికొచ్చింది
ఎవరెస్ట్ శిఖరం ఎక్కివచ్చి
బిడ్డడు ఎంతో కష్టపడి
రాములోరి పానకం తెచ్చాడబ్బా అన్నంతగా
అమ్మమురిపెం
చెంబులో పానకం.. పెద్ద గిన్నెలో గుమ్మరింపు
తలోకాస్త అమ్మ వడ్డింపు
చెంబు కాలి అయ్యింది.
మళ్ళీ రాములోరి గుడి గుర్తొచ్చింది
ఒకటా.. రెండా..
గుండిగల్లో పానకం ఉన్నంత వరకూ
విసుక్కోకుండా పానకం పోస్తున్నంత వరకూ
మా పిల్లకాయల చెంబులో
పానకం ఖాళీ అవుతూనే ఉంది
000
రాములోరి గుడికాడికి
పరుగులు తీయించిన పానకం
కేవలం పానకం మాత్రమే కాదు..
తిరిగిరానీ మధురమైన జ్ఞాపకం
మళ్ళీ ఊరెళ్ళి
నిక్కరేసుకుని
రాములోరి పానకం కోసం పరుగెత్తాలని ఉంది
-గంగాధర్ వీర్ల

Wednesday, 8 March 2017

::పూల గుసగుసలు::
.........
ఆ పూలతోటలో
రకరకాల పూలు
అనేకనేకాల పరిమళాలు
కానీ, వాటి గుండెల్లో
లెక్కకుమించి ఆలోచనలు
000
ఏ సిగలో వాలాలి?
ఏ దేవుడి మెడలో హారమవ్వాలి
ఏ శృంగారపు పందిరి నీడలో
మోహమై నలిగిపోవాలి?
ఏ.. ఉన్నాదపు ముంజేతిపై
బిక్కచచ్చిపోవాలి?
ఏ దోసిళ్ళలో ఇమిడి
నాలుగు అక్షరమాలలుగా
అల్లుకుపోవాలి?
000
ఆ పూలన్నీ..
తమ పూలవనాలను దాటుకుంటూ
ఒక్కొక్కటిగా
మొండితలకాయలవుతున్నాయి
000
పూలఅంగడిలో
అందంగా సింగారించుకుని
ఏ గూటికి చేరాలో తెలియక
వాడిపోని వదనంతో
గుసగుసలాడుకుంటున్నాయి
-గంగాధర్ వీర్ల