Thursday, 27 October 2016


పాద ముద్రికలు
...............

తీరం వెంబడి
నడిచేటప్పడు
మనసుకి కనిపించే
ముద్రలన్నీ ఒకేలా ఉండవ్
కొన్ని అడుగులో అడుగు వేయిస్తాయి
ఇంకొన్నిసుదూరంగా ఎక్కడికో నడిపిస్తాయ్
కొన్ని ముద్రలు
పదే పదే వెంటాడతాయ్
కొన్ని తిరిగి వెంటాడేలా చేస్తాయ్
అక్కడ సాగే నడక ఒక్కటే కావొచ్చు
గుండెల్లో ముద్రించుకునే ముద్రలు మాత్రం అనేకం
కొన్ని..సముద్రపు అలల్లా..
దగ్గరగా వస్తుంటాయ్
మరికొన్ని దూరంగా పోతూ ఉంటాయ్!!
-గంగాధర్ వీర్ల

Wednesday, 12 October 2016



::కొత్త కూడికలు::
.........................
ఏమయ్యిందో ఏమో?!
అక్కడన్నీ రాతివనాలే
ఇసుమంతైనా పచ్చికలేని..
ఎడారి దేహంలా..
దిక్కులేని పక్షిలా..
దారి దొరకదు,
గమ్యం తెలియదు
ఆలోచనల్లోనూ జీవంలేదు
000
ముడుచుకున్న
వేళ్ల సందుల నుంచి వచ్చే
మెటికల శబ్ధంలోనూ
ఓపికలేని నిశ్శబ్దమే.
గమ్యంతోచని తనవు..
నిస్తేజంగా కూలబడుతోంది.
ఎటు చూసినా అంతా అనిశ్చితి
000
సరిగ్గా అప్పుడే
ఎక్కడో నుంచో
చుట్టంచూపుగా వచ్చి
సన్నపాటి గాలితెర భుజాన కప్పుతోంది
కొత్తదారి చూపుతానంటూ..
గుండెలపై వాలిన
వాన చినుకేమో..
బిడ్డను అక్కున చేర్చుకున్న తల్లిలా
లాలనవుతోంది.
తలపైకెత్తి ఆకాశంకేసి చూస్తే
గుంపులు గుంపులుగా
తామెరిగిన దేశానికి
హుషారుగా వలసపోతున్న
పక్షుల కేరింతల సమూహం
.....
మనసులో చిటికెడు
సానుకూల దృశ్యం
కూలబడిన మనిషి రెక్కల్లో
నూతనోత్సాహం
000
దేహంలో కొత్త కూడికలు
వడివడిగా అడుగులు వేస్తున్నాయి
అతడిప్పడు..
దిక్కులు తెలిసిన మనిషి
ఎగురుతున్నపక్షిలో
తనని తాను చూసుకుంటున్న
మరో కొత్త మనిషి!!
-గంగాధర్ వీర్ల

Sunday, 9 October 2016

జీవనది
................
కంటికి బరువెక్కువ
పైకి ఇంకినట్టే కనపడుతుంది.
నలుగురి ముందు
నిండుకుండలా.. గంభీరంగా
తొణకనట్టే ఉంటుంది.
సమయం వస్తే మాత్రం
కట్టలు తెంచుకుంటుంది
గుండెల్ని చీల్చుకొచ్చే కన్నీటికి
ఆనకట్టలేయడం ఎవరి తరం కాదేమో!?
కంటికి బరువెక్కువ
భావోద్వేగాల బరువూ ఎక్కువే
ఇన్ ఫ్లో.. అవుట్ ఫ్లోల..
కొలతలు, కొలమానాల్లేని
ఓ అంతర జలపాతం
-గంగాధర్ వీర్ల, 09-10-16

Wednesday, 21 September 2016

వాన
..............
వాన
అనుకున్నంత సుందరం కాదు.
కవితాత్మకం అంతకన్నాకాదు
వానలో ఎంతటి జాణతనముందో
అంత జాలితనమూ ఉంది
000
వానను గుప్పెట పట్టినప్పుడు
అక్షరాలు మల్లెతీగలై
ఒళ్ళంతా అల్లుకుపోవచ్చేమో?!
000
వాన జలధరింపుకు
పొగలు చిమ్ముకున్న
'కాఫీ' రాగాలు గుర్తుకురావొచ్చేమో?!
000
వాన.. మన చుట్టూతా
ముసురుకున్నప్పుడు
యతిప్రాసలు
గనవిభనజలు
సందులు, సమాసాలు
కవితాప్రపపంచాన
నువ్వానేనా అని పోటీపడొచ్చేమో?!
000
వాన గిచ్చుల్లకు
రొమాంటిక్ తలపుల్లో
అలా తడిసి ముద్దయిపోవొచ్చేమో?!
ఇంకా ఇంకా అనేకనేకాలుగా
వానలో తరిస్తాం.. పరవశిస్తాం
కానీ.. కానీ
వానలో ఎంతటి జాణతనముందో
అంత జాలితనమూ ఉంది
000
అక్కడ
వాన వానగాలేదు
పూట కూలి దొరకని చోట
పస్తులతో తడుస్తోంది
ముంచెత్తిన పంటల సాక్షిగా
రైతు కళ్ళల్లో కన్నీరవుతోంది
కుండపోతలోనూ
చక్రాల బండో.. రిక్షానో లాగుతూ
చెమట చుక్కవుతోంది
మురికివాడల్లోకి చొరబడి
పేదల గుడిసెల మధ్య
కాలవై పొంగుతోంది
000
వాన వానగా లేదు
అనుకున్నంత సుందరం కాదు.
కవితాత్మకం అంతకన్నాకాదు
-గంగాధర్ వీర్ల
21-09-16

Friday, 16 September 2016


//నీవలే//
1
పచ్చిక మైదానంలో
సుతిమెత్తగా మొలచిన
పువ్వులవోలే
2
సముద్రపు అంచున
తడితడిగా నడిచే
అడుగులవోలే
3
రాత్రంతా
చలువ పూలు చల్లే
చంద్రునివోలే
4
క్రీగంట చూపుతో
వెలుగు కళ్ళాపి జల్లే
భానుడి వోలే
వెంటాడుతోంది
ఓ జ్క్షాపకం
నీవలే!!
-గంగాధర్ వీర్ల




Monday, 12 September 2016


::తను-వు::
దేహం.. 
చిక్కిశల్యమై
వాడిపోతుంటే?!
ఎన్ని నదీజలాలతో అభిషేకించి
వికసింప చేయగలం?
000
కన్నీల్లు ఒళ్ళంతా 
తడిపేస్తున్నాగానీ 
చిగురించాలనే ఆశలేకుండానే 
భూమిలోనే ఇంకిపోతోంది
మళ్లీ మళ్లీ వికసించడానికి
ఇష్టంలేని అంకురంలా..
తనలో తాను 
ముడుచుకుపోయిన 
మొగ్గలా.. 
పరులకోసం తనువందించిన 
ఆమెలా..!!
-గంగాధర్ వీర్ల